ధియేటర్ల బంద్ విషయంలో పెద్ద కుట్ర జరిగిందని గట్టిగా నమ్ముతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కఠిన చర్యలు ప్రారంభించారు. సోమవారం ప్రెస్ మీట్ పెట్టిన దిల్ రాజు అసలు ఈ విషయాన్ని మొదట ప్రారంభించింది జనసేన పార్టీ నేత అత్తి సత్యనారాయణేనని తమకు ఏం సంబంధం లేదన్నట్లుగా చెప్పుకొచ్చారు. అత్తి సత్యనారాయణ రాజమండ్రి జనసేన ఇంచార్జ్ గా ఉన్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణతో నిజం తేలే వరకూ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా జనసేన ప్రకటించింది. ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది.
ధియేటర్ల బంద్ విషయంలో పవన్ కల్యాణ్ ఎంత సీరియస్గా ఉన్నారో ఈ చర్య నిరూపిస్తోంది. మరో వైపు ధియేటర్లలో తనిఖీలను ప్రారంభించాలని సినిమాటోగ్రపీ మంత్రికి సూచనలు ఇచ్చారు. ప్రేక్షకులు కొంటున్న టిక్కెట్ కు తగ్గ సౌకర్యాలు అందుతున్నాయా లేదా అన్నదానిపై ధియేటర్లలో సోదాలు నిర్వహించనున్నారు. అలాగే ఇక సినీ పరిశ్రమ నుంచి ఏదైనా ప్రతిపాదన రావాలంటే అది చాంబర్ నుంచి మాత్రమే రావాలని స్పష్టం చేశారు. తన సినిమా వీరమల్లు విషయంలోనూ అదే జరుగుతుందని.. స్పష్టం చేశారు. నిర్మాతలు వ్యక్తిగతంగా వస్తే టిక్కెట్ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోరు.
ఇక టాలీవుడ్ నుంచి వ్యక్తిగతంగా వచ్చే ప్రతిపాదనలు, విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోదు. చాంబర్ నుంచి మాత్రమే రావాలి. అదే సమయంలో .. ధియేటర్ల బంద్ నిర్ణయం వెనుక ఏం జరిగిందో విచారణ జరిగి తీరుతుందని స్పష్టం చేస్తున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రొడ్యూసర్లు .. పవన్ ను పొగుడుతున్నారు. కానీ ఇంతటితో ఆగే అవకాశం లేదని.. అసలు మొత్తం వ్యవహారాన్ని బయట పెట్టాలని పవన్ భావిస్తున్నారు.