రాజమౌళి స్ట్రాటజీ కి వంక పెట్టడానికి లేదు. తను ఓ పని చేస్తే.. దాని విషయంలో వంద రకాలుగా ఆలోచిస్తాడు. ఒక్క పోస్టర్ తోనే షేక్ చేసేయగలడు. అలాంటప్పుడు రిలీజ్ డేట్ విషయంలో ఎంత పెద్ద ప్లాన్ చేయాలి? ‘వారణాసి’ రిలీజ్ డేట్ విషయంలో జక్కన్నపర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాడు. ఏప్రిల్ 7న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేశాడు. రాజమౌళిని ఏ విషయంలో అయినా నమ్మొచ్చు కానీ, రిలీజ్ డేట్ విషయంలో నమ్మలేం. ఆయనసినిమాలు అన్నిసార్లు వాయిదా పడ్డాయి మరి. కానీ.. ఈసారి మాత్రం రిలీజ్ డేట్ విషయంలో రాజమౌళి పక్కాగా ఉన్నాడు. అన్ని విధాలా ఆలోచించుకొనే ఈ రిలీజ్ డేట్ ఖాయం చేసుకొన్నాడు.
స్ట్రాటజీ పరంగా కూడా ఏప్రిల్ 7 మంచి డేట్. ఆ రోజు ఉగాది. సెలవు రోజు. కాకపోతే బుధవారం. సాధారణంగా మన సినిమాలు గురు లేదా, శుక్రవారం విడుదల అవుతాయి. బుధవారం రిలీజ్ కావడం అరుదు. కానీ పండగ రోజు కాబట్టి మినహాయింపు ఉంటుంది. బుధవారం విడుదల అంటే, మంగళవారం నుంచే ప్రీమియర్లు ఉంటాయి. 10వ తేదీ రెండో శనివారం. కాబట్టి సెలవుదినం. ఆదివారం ఎలాగూ వీకెండ్. రెండో వారంలో కూడా సెలవలు బాగా కలిసొచ్చాయి. 14న అంబేద్కర్ జయంతి. సెలవు దినం. 15న శ్రీరామ నవమి. అది కూడా హాలీడేనే. ఇలా వరుసగా వారణాసికి సెలవలు ప్లస్ అయ్యాయి. రెండోవారం వరుసగా రెండు రోజులు సెలవు రావడం కలక్షన్ల పరంగా హెల్ప్ అవుతుంది. ఎలా చూసినా రాజమౌళి రిలీజ్ డేట్ విషయంలో నిర్దిష్టమైన ప్రణాళికతో ఉన్నాడు.కాకపోతే ఆ సమయానికి సినిమాని రిలీజ్ చేయడమే పెను సవాల్. రాజమౌళి సినిమాలన్నీ వీఎఫ్ఎక్స్ తో ముడిపడినవే. ఈ సినిమా కూడా అంతే. వీఎఫ్ఎక్స్ స్టూడియోలు హ్యాండ్ ఇవ్వకపోతే.. రాజమౌళి స్కెచ్ వర్కవుట్ అవుతుంది. లేదంటే ప్లాన్ బీ అనేది కూడా జక్కన్న దగ్గర సిద్ధంగానే ఉండి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఏప్రిల్ 7 ఫిక్సయ్యాడు. చూద్దాం..ఏమవుతుందో?
