రాజమౌళి గొప్పగా సినిమా తీస్తాడు. అంతకంటే గొప్పగా మార్కెటింగ్ చేసుకొంటాడు. తన విజయానికి కారణాల్లో అది ప్రధానమైనది. సినిమాకు సంబంధించిన కంటెంట్ తో కాకుండా, తన స్ట్రాటజీతో అందరి కళ్లూ తన ప్రాజెక్ట్ వైపు పడేలా చేసుకొంటాడు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాకీ అదే స్ట్రాటజీని అప్లై చేస్తున్నాడు.
మహేష్ – రాజమౌళి సినిమా కెన్యాలో షూటింగ్ ప్రారంభించుకొంది. అక్కడ దట్టమైన అడవుల్లో కొన్ని కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తారు. అక్కడే రెండు పాటలూ షూట్ చేసే అవకాశం ఉంది. మామూలుగా అయితే.. గప్ చుప్ గా కెన్యా వెళ్లి, షూటింగ్ పూర్తి చేసుకొని రావొచ్చు. కానీ… కెన్యాకు సంబంధించిన మంత్రుల్ని, కీలకమైన నేతల్ని కలుసుకొన్నాడు రాజమౌళి. ఈ సమావేశంతో కెన్యా ప్రజల దృష్టినే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికుల దృష్టినీ తన ప్రాజెక్ట్ వైపు తిప్పుకొన్నాడు. ఇది పైసా కూడా అవసరం లేని ప్రచారం. వంద కోట్లు ఖర్చు పెట్టినా రాని పబ్లిసిటీ.
బాహుబలి, ట్రిపుల్ ఆర్ చిత్రాలతో హాలీవుడ్ ని టచ్ చేసే ప్రయత్నం చేసిన రాజమౌళి.. ఈసారి ఏకంగా అక్కడే పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈసారి హాలీవుడ్ మేకింగ్ కి ఎక్కడా తగ్గకుండా ఈ ప్రాజెక్ట్ ని తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాని రెండు భాగాలుగా నిర్మిస్తారని, దాదాపు 1200 కోట్ల ఖర్చు అవుతుందని ఓ ప్రచారం జరుగుతోంది. రెండు భాగాలైతే కరెక్టే కానీ, ఆ బడ్జెట్ 1200 కోట్లతో ఆగకపోవొచ్చు. ఫస్ట్ పార్ట్ కే దాదాపు రూ.1000 కోట్లు ఖర్చవుతుందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ సినిమాని దాదాపు 100 కోట్ల ప్రేక్షకులకు చేరువ చేయాలన్నది రాజమౌళి టార్గెట్. దానికి ఏమాత్రం చేరువైనా కనీ వినీ ఎరుగని వసూళ్లని చూడొచ్చు.