రాజమౌళి ఓ మార్కెటింగ్ జీనియస్. గొప్ప సినిమా తీయడం ఒక ఎత్తు. దాన్ని మార్కెట్ చేయడం మరో ఎత్తని బలంగా నమ్మిన దర్శకుడు. తెలుగు సినిమాని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడంలో తన మార్కెటింగ్ స్కిల్స్ ఎంత దోహదం చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాని ఎప్పుడు ఎలా ప్రమోట్ చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన సినిమా గురించి ఏం మాట్లాడినా, మాట్లాడకపోయినా ప్రమోషనే. సంప్రదాయ పద్ధతుల్లో సినిమాని ప్రమోట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాల్ని ఓరకంగా ప్రమోట్ చేస్తే, ఇప్పుడు ‘వారణాసి’ కోసం తన స్ట్రాటజీ మొత్తంగా మార్చేశాడు.
వారణాసి గ్లింప్స్‌ని ఎంత పెద్ద స్థాయిలో విడుదల చేశారో గుర్తుండే ఉంటుంది. దేశం మొత్తమ్మీదే అలాంటి ఈవెంట్ జరగలేదు. ఈ ఒక్క ఈవెంట్… ఈ సినిమాకి గ్లోబల్ స్థాయిలో ప్రచారాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమాలోని పాట.. ముందస్తు ప్రకటనలు లేకుండా నేరుగా విడుదల చేసి మరో షాక్ ఇచ్చాడు.
సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా గురించి గానీ, కథ గురించి కానీ, పాత్రల గురించి కానీ మాట్లాడడు రాజమౌళి. అసలు అంత స్పేస్, టైమ్ ఉండదు. కానీ.. ‘వారణాసి’ లెక్క వేరు. ఇంటర్నేషనల్ మీడియాకు ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు ఇచ్చాడు జక్కన్న. మహేష్, ఫృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా కూడా ఈ సెషన్స్ లో పాల్గొన్నారు. ఈ సినిమాలోని మహేష్ పాత్ర గురించి, కథా నేపథ్యం గురించిన లీకులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సెట్స్ ఎలా ఉంటాయో మీడియాకు ముందే లీక్ చేశాడు జక్కన్న.
ఇదంతా రాజమౌళి కొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ అనుకోవచ్చు. సినిమా గురించి, స్పాన్ గురించి ముందే హింట్ ఇచ్చి, ఆడియన్ ని ప్రిపేర్ చేస్తున్నాడు జక్కన్న. ‘వారణాసి’ ని రాజమౌళి తెలుగు సినిమాలానో, భారతీయ సినిమాలానో చూడడం లేదు. దీన్ని ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా చూస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా పేరు వినిపించాలంటే ముందు నుంచీ ప్రమోషన్లు చేసుకొంటూ రావాలి. ఇప్పుడు జక్కన్న చేస్తోంది అదే.
కాకపోతే తెలుగు మీడియాను ఆయన పట్టించుకోవడం లేదు. ‘వారణాసి’ పూర్తయిన తరవాత కూడా ఆయన ప్రమోషన్లు టాలీవుడ్ బయటే చేసే అవకాశం పుష్కలంగా ఉంది. ముందు హాలీవుడ్ తో మొదలెట్టినా ఆశ్చర్యం లేదు. కచ్చితంగా రాజమౌళి ఈ సినిమాని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాలనుకొంటున్నాడు. అది మాత్రం పక్కా. దాని రిజల్ట్ ఏమేరకు ఉంటుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.
