సినిమా పబ్లిసిటీని కొత్తగా డిజైన్ చేయడం ఒక ఆర్ట్. కొన్ని క్రియేటివ్ ఆలోచనలు రీచ్‌ను పూర్తిగా మార్చేస్తాయి. అయితే అవే ఆలోచనలు మూసకట్టుగా ఫాలో అయితే జనాలకు బోర్ కొడతాయి. ఇలా ఎప్పటికప్పుడు పబ్లిసిటీని కొత్తగా డిజైన్ చేయడంలో రాజమౌళి రూటు వేరు. మహేష్ బాబుతో ప్రస్తుతం చేస్తున్న సినిమా విషయంలో ఆయన ఆలోచనలన్నీ భిన్నంగా ఉన్నాయి.
మహేష్ బాబు లాంటి హీరో సినిమా ఈవెంట్‌ను అన్ని ఛానల్స్ ప్రచారం చేస్తాయి. కానీ 15న జరగబోయే ఈవెంట్‌ను రాజమౌళి ఎక్స్‌క్లూజివ్‌గా జియో, హాట్‌స్టార్‌కి ఇచ్చేశారు. అలాగే ఈ సినిమా అప్డేట్స్ విషయంలో కూడా కొత్త ఎత్తుగడను ఫాలో అవుతున్నారు. ముందుగా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. డైరెక్ట్‌గా కంటెంట్ వదిలేస్తున్నారు. విలన్ పాత్రధారి సుకుమారన్ ఫస్ట్ లుక్ వచ్చేవరకు దాని గురించి ఎటువంటి సమాచారం లేదు.
నిన్న సంచారి అనే పాట విడుదల చేశారు. దీనిపై కూడా ముందుగా ఎటువంటి సమాచారం లేదు. సినిమా సర్కిల్స్‌లోనే పాట వస్తున్నట్లు చాలా మందికి తెలియలేదు. ముందుగా పాట యాపిల్ మ్యూజిక్‌లో స్ట్రీమ్ అయింది, తర్వాత యూట్యూబ్ వేదికలకు వచ్చింది. కాకపోతే రిలీజ్ అయిన తర్వాత రావాల్సిన రీచ్ వచ్చేసింది.
నిజానికి ఇలాంటి పాట వస్తుందంటే ముందుగా ఒక పోస్టర్ వదులుతారు. ఈ మధ్యకాలంలో అయితే చాలా సినిమాలు “ప్రోమో రాబోతోంది” అని కూడా పోస్టర్లు వదులుతున్నాయి. అయితే ఇదంతా కాలం చెల్లిన పబ్లిసిటీ అని జక్కన్న ఫీల్ అయ్యారేమో… లేదా SSMB 29 లాంటి ప్రాజెక్ట్‌కి ఇలాంటి మూస అవసరం లేదని భావించారేమో… కానీ ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో జక్కన్న ఆలోచనలే చాలా భిన్నంగా ఉన్నాయి.
