‘ఉడత’ రాజమౌళి మూడు సలహాలు

అమరావతిలో భవనాలకు సంబంధించి నార్మన్‌ పోస్టర్స్‌ రూపొందించిన నమూనాలపై ఈ రోజు దాదాపు తుది నిర్ణయం జరిగినట్టే కనిపిస్తుంది. అధికారులు అధినేతలతో పాటు అగ్రదర్శకుడు రాజమౌళి పాల్గొనడం ఒకటైతే ఆయన మీడియాతో మాట్లాడ్డం మరో విశేషమైంది. ఈ సందర్భంగా ఆయన తను చేసిందేమిటో చెప్పడమే గాక తన పాత్రకు ఎక్కువ పేరొచ్చిందని కూడా చమత్కరించారు. వారధి నిర్మాణంలో వానరవీరులు ఎందరో పాల్గొన్నా అందరూ ఉడత గురించే చెప్పుకున్నట్టే తన పరిస్థితి వుందనడం తమాషాగా వుంది. మరి ఈ ఉడత ఏం చేసిందంటే మూడు పనులు చేశానన్నారు. ఒకటి మొదటి సమావేశంలో అసలు ఈ నిర్మాణాలకు ఒక నిర్దేశక పత్రం వుండాలని నార్మన్‌ అడిగితే దాన్ని తయారు చేశారట. తెలుగుదనం భారతీయత, అందరూ వచ్చి చూసేంత ఆకర్షణ, ఆధునికత కలగలసివుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన దాన్ని మార్గదర్శక పత్రంగా చేశారట. ఇక రెండవది నిర్మాణాలలో తెలుగు సంసృతిని ప్రతిబింబించేందుకు వీలుగా ఇమేజెస్‌ అందించే బాధ్యత ఇచ్చారట. ఆయన ఇచ్చిన ఇమేజెస్‌ మెప్పు పొందకపోవడం కొసమెరుపు. వాటిని మీడియా సెంటర్‌లోనో కల్చరల్‌ సెంటర్‌లోనో వాడతారట.ఇదిగాక భవనం మధ్యలో తెలుగుతల్లి విగ్రహంపై కిరణాలు పడేలా ఏర్పాటుచేస్తారట. తను చేసింది ఇదేనని రాజమౌళి వినయంగా చెప్పుకున్నారు. అమరావతిపై తాను లఘు చిత్రం రూపొందిస్తున్నానన్న కథనాలు కూడా కొట్టిపారేశారు. ఏమైతేనేం మీడియాకు తన పాత్ర గురించి తనే స్పష్టత ఇవ్వడం బాగుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.