రాజమౌళి తన సినిమా విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అందరూ ఆయన రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఎంత పెద్ద హీరో అయినా ఇందుకు మినహాయింపు ఉండదు. ఎందుకంటే రాజమౌళి స్టామినా అలాంటిది. ఆయన కోరుకొంటే.. దేశంలోనే టాప్ స్టార్ ని తీసుకొచ్చి సినిమా తీయగలరు. వందల కోట్లు ఖర్చు పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. ఆఖరికి కథేమిటి? అని కూడా అడగరు. అదీ ఆయన స్థాయి. కాబట్టి సూపర్ స్టార్లూ, డూపర్ స్టార్లు కూడా ఆయన రూల్స్ లోకి రావాల్సిందే.
సినిమా సెట్స్ కి వెళ్లే ముందు రాజమౌళి కొన్ని కండీషన్లు పెడతారు. తన సినిమా పూర్తయ్యే వరకూ మరో సినిమా చేయకూడదు. కాల్షీట్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. కథ గురించీ, సినిమా గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. మీడియాతో కూడా మాట్లాడకూడదు… ఇలాంటి కండీషన్లు చాలా ఉంటాయి. మహేష్ బాబుతో సినిమా మొదలయ్యే ముందు కూడా రాజమౌళి ఇలాంటి కండీషన్లే పెట్టారని చాలా గుసగుసలు వినిపించాయి. మహేష్ కి అసలే ఫారెన్ టూర్లంటే పిచ్చి. వీలు చిక్కినప్పుడు తన ఫ్యామిలీతో కలిసి సరదాగా షికారుకు వెళ్తుంటారు. గ్యాప్ దొరికితే చాలు.. కమర్షియల్ యాడ్లు కూడా చేసేస్తుంటారు. రాజమౌళి సినిమా అనేసరికి ఇవన్నీ బంద్ అనుకొన్నారు.
కానీ విచిత్రంగా మహేష్‌కు ఈ వెసులు బాటు కల్పించారు. ఓవైపు రాజమౌళి షూటింగ్ జరుగుతుండగానే.. మహేష్ ఎంచక్కా యాడ్లు చేసుకొన్నాడు. ఫ్యామిలీతో పాటు టూర్లు కూడా వెళ్లొచ్చాడు. తన గెటప్ రివీల్ అయిపోతుందేమో అని ఎక్కడా భయపడకుండా ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చేశాడు. దాంతో ఈ స్పెషల్ ట్రీట్ మెంట్ టాలీవుడ్ లో బాగా హాట్ టాపిక్ అయ్యింది.
రాజమౌళి దగ్గర మరో అలవాటు కూడా ఉంది. సినిమాకు సంబంధించి ఏదైనా కంటెంట్ బయటకు వదిలేముందు.. అంటే టీజర్, ట్రైలర్, పోస్టర్, పాట.. ఇలాగన్నమాట. అవన్నీ పూర్తిగా తన అధీనంలోనే ఉంటాయి. ఎప్పుడు, ఎలాంటి కంటెంట్ వదులుతున్నారో తనకు మాత్రమే తెలుసు. హీరోలకు చూపించి, వాళ్ల అభిప్రాయాలు తీసుకోవడం లాంటివేం ఉండవు. ఆర్.ఆర్.ఆర్ విషయంలోనూ అదే జరిగింది. రాజమౌళి ఎప్పుడు ఎలాంటి కంటెంట్ వదులుతున్నాడన్న సంగతి ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు కూడా తెలిసేది కాదు. బయటకు వచ్చాక.. అందరితో పాటు చూసుకోవడం తప్ప అదనంగా అడ్వాంటేజ్ ఉండేది కాదు.
కానీ ఇప్పుడు అలా కాదట. తాను విడుదల చేసే ప్రతీ కంటెంట్ మహేష్ తో చర్చించాకే.. రిలీజ్ చేస్తున్నాడట. ఆఖరికి 15న విడుదల చేయబోయే గ్లింప్స్ కూడా మహేష్ కి చూపించి, తన సలహాలు తీసుకొన్నాకే ఫైనల్ కట్ ఫిక్స్ చేశాడని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఎవరి దగ్గరా బెండ్ అవ్వని రాజమౌళి.. మహేష్ దగ్గరకు వచ్చేసరికి, ఇన్ని వెసులు బాట్లు ఎందుకిస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. బహుశా.. రాజమౌళిలో ఇది కొత్తగా వచ్చిన మార్పేమో? కంటెంట్ ముందే అందుబాటులోకి వచ్చేయడం వల్ల, మహేష్ సలహాలూ తీసుకోవాలని భావించి ఉంటాడు. మున్ముందు రాబోయే కంటెంట్ కూడా మహేష్ కు ముందే చూపించి, ఇలానే తన అభిప్రాయాలు తీసుకొని రిలీజ్ చేస్తాడా, లేదంటే ఇది వరకటిలా తన సొంత గట్ ఫీలింగ్ తోనే ముందుకు వెళ్తాడా అనేది చూడాలి. ఇప్పటికైతే… రాజమౌళి తనకు ఇస్తున్న ప్రాధాన్యత చూసి మహేష్ కూడా చాలా గర్వంగా ఫీలవుతున్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.


