మిరాయ్ చూసినవాళ్లంతా చెబుతున్న మూకుమ్మడి మాట… ‘విజువల్స్ అదిరిపోయాయి’ అని. ఈమధ్య కాలంలో వీఎఫ్ఎక్స్ సినిమాల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. వీఎఫ్ఎక్స్ తేలిపోయి, ఆ ప్రభావం సినిమా ఫలితంపై పడిన సందర్భాలు కోకొల్లలు. అందుకే వీఎఫ్ఎక్స్ విషయంలో ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ‘మిరాయ్’ లో మాత్రం విజువల్స్ బాగా కుదిరాయి. ఎక్కడా వంక పెట్టడానికి లేకుండా చాలా చక్కగా తీర్చిదిద్దారు. తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇవ్వగలిగారు. ఈ క్రెడిట్ వెనుక దర్శక నిర్మాతల కృషి ఉంది. దాంతో పాటు ‘రాజాసాబ్’ టీమ్ కూడా ఉంది.
మిరాయ్, రాజాసాబ్.. ఇవి రెండూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలోనే రూపొందాయి. ‘రాజాసాబ్’ కోసం పీపుల్ మీడియా ఓ వీఎఫ్ఎక్స్ టీమ్ ని రెడీ చేసింది. వాళ్లంతా ‘రాజాసాబ్’ పనుల్లో ఉన్నారు. ‘రాజాసాబ్’ వాయిదా పడడంతో.. వీఎఫ్ఎక్స్ టీమ్ కి కాస్త టైమ్ దొరికింది. దాంతో అదే టీమ్ తో ‘మిరాయ్’ వర్క్ కూడా చేయించింది నిర్మాణ సంస్థ. ‘రాజాసాబ్’ కు ఎవరైతే పని చేస్తున్నారో, వాళ్లే ‘మిరాయ్’కీ వీఎఫ్ఎక్స్ రెడీ చేశారు. ఒకవేళ.. ‘రాజాసాబ్’ అనుకొన్న సమయానికి విడుదల చేస్తే.. ‘మిరాయ్’ మరో టీమ్ వెదుక్కోవాల్సివచ్చేది. ‘రాజాసాబ్’ వాయిదా పడడం `మిరాయ్`కి కలిసొచ్చింది. ‘మిరాయ్’ వీఎఫ్ఎక్స్ తో పోలిస్తే… ‘రాజాసాబ్’ వీఎఫ్ఎక్స్ బడ్జెట్ రెండింతలు ఎక్కువ. మిరాయ్ కే ఇలాంటి అబ్బర పరిచే ఎఫెక్ట్స్ ఉంటే.. ‘రాజాసాబ్’లో విజువల్స్ ఏ రేంజులో ఉంటాయో మరి..?!
