తెలుగులో ఉన్న ప్రతిభావంతమైన నటుల్లో రాజశేఖర్ ఒకరు. ఆయన ఇప్పటికీ హీరోగా కొనసాగుతున్నారు. రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రంగంలోకి దిగితే – ఆయన ధాటిని తట్టుకోవడం కష్టమని ఎప్పటి నుంచో సినీ పండితులు చెబుతూనే ఉన్నారు. జగపతిబాబు లాంటి వాళ్లు విలన్ గా టర్న్ అయినప్పుడే రాజశేఖర్ కూడా ఈ దిశగా అడుగులు వేస్తారని చెబుతూ వచ్చారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ప్రకాష్ రాజ్ చేయాల్సిన పాత్ర ముందు రాజశేఖర్ దగ్గరకే వెళ్లింది. ‘ధృవ’ సినిమాలోనూ విలన్ రోల్ కోసం ఆయన్ని సంప్రదించారు. కానీ.. రాజశేఖర్ సున్నితంగా తిరస్కరించారు.
అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. రాజశేఖర్ ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. ఆయన కూడా క్యారెక్టర్, విలన్ పాత్రలవైపు చూస్తున్నారు. దర్శకులు కూడా ఆయన్ని దృష్టిలో ఉంచుకొని కథలు, పాత్రలు రాస్తున్నారు. విజయ్ దేవరకొండ సినిమా ‘రౌడీ జనార్థన్’లో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. శర్వానంద్ సినిమా ‘బైకర్’లోనూ ఆయన కనిపిస్తున్నారు. రెండు సినిమాల్లోనూ ఆయనవి ప్రాధాన్యం ఉన్న పాత్రలే. పారితోషికం కూడా గట్టిగానే గిట్టుబాటు అవుతోందని సమాచారం. ఇవి కాకుండా ఆయన హీరోగా `మగాడు` అనే సినిమా రూపుదిద్దుకొంటోంది. తమిళంలో విజయవంతమైన లబ్బరు పంతు అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఓ యువ హీరో ఇందులో కనిపించబోతున్నాడు. ఇందులో ఓ పాత్ర కోసం రాజశేఖర్ ని ఎంచుకొన్నారు. మరో పెద్ద హీరో సినిమాలోనూ రాజశేఖర్ విలన్ గా దర్శనమివ్వబోతున్నారన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఎలా చూసినా రాజశేఖర్ లైనప్ స్ట్రాంగ్ గానే వుంది. ఇది వరకు ‘నేనేంటి.. విలన్ ఏంటి?’ అని ఆలోచించిన రాజశేఖర్.. ఇప్పుడు ఎక్కువగా విలన్ పాత్రలపైనే ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజంగానే ఇది మంచి మార్పు. రాజశేఖర్ లాంటి నటులు విలన్లుగా ఎంట్రీ ఇస్తే.. హీరో పాత్రలకూ కొత్త శక్తి వస్తుంది. కథలూ కొత్తగా కనిపిస్తాయి.