ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వైరం ప్రజా ప్రయోజనాలను దాటి రాష్ట్ర మనుగడకే ముప్పుగా మారుతోంది. రాజకీయ పార్టీగా అధికారంలో ఉన్నప్పుడు లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాల్సింది పోయి, కేవలం రాజకీయ లబ్ధి కోసం వైసీపీ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకోవడం నుండి, పొరుగు రాష్ట్రాలతో కుమ్మక్కై జల ప్రయోజనాలను పణంగా పెట్టడం వరకు వైసీపీ తీరు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే మిన్న అన్నట్లుగా మారింది.
నీటి వివాదంలో తెలంగాణకు సపోర్ట్ ?
తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాల విషయంలో వైసీపీ అనుసరిస్తున్న వైఖరి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని, ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటా విషయంలో రాజీ పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుంటే, దానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి, తమ అనుకూల మీడియాలో ఆ వార్తలను తొక్కిపెట్టడం లేదా వక్రీకరించడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. నీటి విషయంలో ఏపీకి నష్టం జరుగుతున్నా సరే, రాజకీయంగా ఎదుటి పక్షాన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకోవడం రాష్ట్ర వినాశనానికి పునాది వేయడమేనన్న ఆగ్రహం ప్రజల్లో కనిపిస్తోంది.
పెట్టుబడులు రాకుండా కుట్రలు !
రాష్ట్ర ఆర్థిక పురోగతికి వెన్నెముక లాంటి పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు మరింత వివాదాస్పదంగా మారింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రపంచ స్థాయి సంస్థలతో సంప్రదింపులు జరుపుతుంటే, ఆయా సంస్థలకు ఇక్కడ పెట్టుబడులు పెట్టవద్దు అంటూ లేఖలు రాయడం, ప్రతికూల మెయిల్స్ పంపడం వంటి చర్యలకు వైసీపీ పాల్పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్న కనీస స్పృహ లేకుండా, కేవలం ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకోవడం రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్టగా కనిపిస్తోంది.
ప్రజలు కష్టాలు పడితే ప్రభుత్వంపై కోపంతో ఓట్లేస్తారని వ్యూహమా?
అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వైసీపీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రంపై విషం చిమ్ముతోందియ రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి కానీ, రాజకీయం కోసం రాష్ట్రాన్ని నాశనం చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తు కంటే రాజకీయ ఉనికికే ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి అడుగులోనూ అడ్డంకులు సృష్టించడం వల్ల రాష్ట్రం దశాబ్దాల కాలం వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకునే ఏ శక్తినైనా వారు క్షమించరని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయాలు మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కలిసి రావాలని సామాన్య ప్రజలు సైతం కోరుకుంటున్నారు. అంతే కానీ ప్రజలను కష్టాలు పెడితే .. ప్రభుత్వంపై కోపం వచ్చి తమకే ఓటేస్తారని అనుకోవడం రాజకీయ అమాయకత్వమే అవుతుంది. భస్మాసుర హస్తం అవుతుంది.


