రాజకీయాల్లోకి వచ్చాక అందర్నీ కలుపుకుని పోలేకపోవచ్చు కానీ.. శుత్రవుల్ని మాత్రం చేసుకోకూడదు.కానీ విజయ్ పార్టీ ఇలాంటి తప్పులు చాలా చేస్తోంది. అవసరం లేకపోయినా రజనీకాంత్ ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఆగ్రహం తెప్పించారు. తమిళగ వెట్రి కళగం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు అధికార DMK కుటుంబం ఆయనను తీవ్రంగా భయపెట్టిందని, ఆ బెదిరింపులకు భయపడే రజనీ వెనక్కి తగ్గారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తమిళ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
ఆధవ్ అర్జున తన ప్రసంగంలో రజనీకాంత్‌ను తక్కువ చేస్తూ, విజయ్ను గొప్పగా చూపే ప్రయత్నం చేశారు. రజనీకాంత్ సిస్టమ్‌ను మార్చాలనుకున్నారు కానీ DMK బెదిరింపులకు లొంగిపోయి తిరిగి సినిమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్‌లో నటిస్తున్నారు. కానీ మా నాయకుడు విజయ్ అలా కాదు, ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఆయనకు ఉంది అని విజయ్‌కు రైట్ హ్యాండ్ లాంటి ఆధవ్ అర్జున చెప్పుకొచ్చారు. ఇది రజనీకాంత్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.
ఈ వ్యాఖ్యలపై రజనీకాంత్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. రజనీకాంత్ వంటి మహోన్నత వ్యక్తిని అవమానించడం తగదని, రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తులను పక్కన పెట్టుకోవడం విజయ్‌కు భవిష్యత్తులో నష్టమని అంటున్నారు. ఆధవ్ అర్జునను వెంటనే పార్టీ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆధవ్ అర్జునకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ, రజనీకాంత్ అనారోగ్యం, కోవిడ్ కారణాల వల్లే రాజకీయాలకు దూరమయ్యారని, బెదిరింపులకు భయపడే వ్యక్తి ఆయన కాదని స్పష్టం చేస్తున్నారు.
రజనీకాంత్ ఎప్పుడూ DMKకి మంచి మిత్రుడని, ఆయనను బెదిరించాల్సిన అవసరం తమకు లేదని ఆ పార్టీ నేతలంటున్నారు. చెప్పారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే విజయ్ పార్టీ ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం తమిళనాడులో విజయ్ అభిమానులకు , రజనీ అభిమానులకు మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టకపోతే్.. విజయ్ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
