టీజర్, ట్రైలర్ సినిమా పబ్లిసిటీలో కీలకం. ట్రైలర్ చూసే సినిమాకి వెళ్ళాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటారు ఆడియన్స్. టీవీలు అందుబాటులోకి రాని రోజుల్లో కూడా ఒక సినిమాకి సంబంధించిన ట్రెయిలర్‌ని మరో సినిమా ప్రదర్శన మధ్యలో వేయించేవారు. ఇప్పుడు ట్రైలర్ ప్రాముఖ్యత ఇంకా పెరిగింది. ట్రైలర్ కట్నే బట్టే బిజినెస్ జరుగుతుంది. అయితే రజనీకాంత్ కూలీకి ట్రైలర్ తో పనిలేదనే ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా సాగుతోంది.
రజనీకాంత్–లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ సెట్ అయినప్పుడే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి భారీ తారాగణం కూడా పెట్టుకున్నారు. ఇప్పటికి కొన్ని పోస్టర్లు, సాంగ్ వదిలారు. అవన్నీ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేశాయి. ఇప్పటికే బిజినెస్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. అందుకే ట్రైలర్ లేకుండానే నేరుగా థియేటర్స్‌కి వచ్చేయాలని టీం ప్లాన్ చేస్తోందని టాక్.
ట్రైలర్ రిలీజ్ చేస్తే కథ, కథనాలు, పాత్రల ఒక అవగాహన వచ్చేస్తుంది. సినిమా విడుదల అయ్యే రోజే ప్రేక్షకులు ఆ అనుభూతిని తెరపై పొందేలా ప్లాన్ జరుగుతుందట. ఇది కొత్త ప్రయత్నమే. బిజినెస్ జరిగిపోయింది కాబట్టి ఈ ప్రయోగానికి అడ్డులేకపోవచ్చు. ఒకవేళ వర్క్ అవుట్ అయితే ఇదే ట్రెండ్ కొనసాగే ఛాన్స్ వుంది.