తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ పథకం కింద నిర్మించిన ఫ్లాట్లను విక్రయించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఫ్లాట్లు హైదరాబాద్లోని బండ్లగూడ , పోచారం ప్రాంతాల్లో ఉన్నాయి. తక్కువ ధరలకు ఫ్లాట్లు అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. బండ్లగూడలో సహభావన టౌన్షిప్, పోచారం సద్భావన టౌన్షిప్ లలో ఈ ఫ్లాట్లు ఉన్నాయి.
ఫ్లాట్ల ధరలు చదరపు అడుగుకు రూ.2,500 నుండి రూ.4,000 వరకు ఉన్నాయి, ఇవి మార్కెట్ ధరలతో పోలిస్తే చాలా తక్కువ. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు సుమారు 545 చదరపు అడుగులు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు సుమారు 767 చదరపు అడుగులు, త్రిపుల్ బెడ్రూమ్ డీలక్స్ ఫ్లాట్లు 1,600 చదరపు అడుగుల వరకు ఉన్నాయి. ఈ ఫ్లాట్లలో కొన్ని గతంలో వేలంలో అమ్మాయి. మిగిలిన వాటిని ఫస్ట్-కమ్-ఫస్ట్-సర్వ్ పద్ధతిలో విక్రయించేందుకు నిర్ణయించారు. దరఖాస్తుదారులు www.swagruha.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది.
సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు రూ. 1 లక్ష, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు రూ. 2 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలి. అలాట్మెంట్ ఆర్డర్ జారీ అయిన తర్వాత 60 రోజుల్లో మిగిలిన మొత్తం చెల్లించాలి, లేకపోతే టోకెన్ అడ్వాన్స్ రీఫండ్ చేస్తారు. బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లోని ఈ ఫ్లాట్లు ప్రీమియం లొకేషన్లలో ఉండటం, మంచి కనెక్టివిటీ కలిగి ఉండటం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఆ ఏరియాల్లో ఇల్లు కొనే ఆలోచన ఉన్న వారి చూసి.. నిర్ణయం తీసుకోవచ్చు.