నగ్న ప్రదర్శనలు చాలా మంది ప్రచార సాధకాలు. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా కనిపిస్తానంటూ గతంలో చాలా మంది ఇలాంటి బోల్డ్ కామెంట్లు చేసి సెలబ్రిటీలు అయ్యారు. ఇలాంటి ప్రకటనలకు గతంలో చాలా హైప్ ఉండేది. పర్సనల్ మైలేజ్ కూడా వచ్చేది. సోషల్ మీడియా పెరిగిన తర్వాత ట్రోలింగ్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత ఇలాంటి ప్రకటనలు ఇవ్వడానికి చాలా మంది వెనకడుగు వేశారు. అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇలాంటి ఓ బోల్డ్ స్టేట్మెంట్ వచ్చింది.
‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు నెగటివ్ టాక్ వస్తే తాను అర్ధనగ్నంగా అమీర్‌పేట్ సెంటర్లో తిరుగుతానంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు దర్శకుడు సాయిలు. ‘ఈటీవీ విన్ ఒరిజినల్స్’లో రూపొందిన సినిమా ఇది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దర్శకుడు వేణు ఉడుగుల పర్యవేక్షణలో తెరకెక్కిన సినిమా కావడంతో పాటు ట్రైలర్, సాంగ్స్ జనాల్లోకి వెళ్లాయి. సినిమాలో ఏదో సంచలనమైన కంటెంట్ ఉందనే నమ్మకం కలిగించింది. సినిమా మీద ఉన్న హైప్‌ను మరింత పెంచే క్రమంలో దర్శకుడి నుంచి అర్ధనగ్న స్టేట్మెంట్ వచ్చింది.
మరి ఇలాంటి చర్యల వల్ల సినిమాకి మేలు జరుగుతుందా? అంటే ఖచ్చితంగా జరగదనే చెప్పాలి. సినిమా అనేది ఒక క్రియేటివ్ వర్క్. జనానికి నచ్చడం, నచ్చకపోవడం ఎవరి చేతిలో ఉండదు. నచ్చితే హ్యాపీ. నచ్చకపోతే నచ్చే సినిమా తీయాలి. కొన్నిరోజుల క్రితం ఓ దర్శకుడు తన సినిమాకి ప్రేక్షకులు రావడం లేదని చెప్పుతో కొట్టుకున్నాడు. తర్వాత అది ఎంత తప్పో తెలుసుకున్నాడు. జనానికి నచ్చే సినిమా తీయాలి, జనాన్ని థియేటర్‌కి తీసుకురావడంపై దృష్టి పెట్టాలి కానీ నెగటివ్ టాక్ వస్తేనో, జనం రాకపోతేనో ఇలా చెప్పుతో కొట్టుకోవడాలు, అర్ధనగ్న ప్రదర్శనలు సరికాదు.


