రివ్యూ : రాక్ష‌సుడు

తెలుగు360 రేటింగ్‌: 2.75/5

ధ్రిల్ల‌ర్ క‌థ‌ల్లో ఉండే కిక్కేవేరు.
ప్ర‌శ్న‌లు… వాటిని వెదుక్కుంటూ జ‌వాబులు.
కొన్ని సార్లు… జ‌వాబులు క‌నిపిస్తాయి.. వాటిని ప‌ట్టుకుని ప్ర‌శ్న‌ల్ని అన్వేషించుకుంటూ సాగిపోవాలి.
థ్రిల్ల‌ర్ సినిమా.. ఓ ప‌జిల్ లాంటిది. మ‌నం ఛేదించ‌లేని ఓ ప‌జిల్ ఇచ్చి, ద‌ర్శ‌కుడు తాను సాల్వ్ చేస్తూ.. మ‌న‌కు థ్రిల్ కి గురి చేయ‌డ‌మే థ్రిల్ల‌ర్ ల‌క్ష‌ణం.

కొన్ని థ్రిల్ల‌ర్‌లు ప్ర‌శ్న‌ల్ని రేకెత్తించ‌డం వ‌ర‌కూ బాగుంటాయి.
స‌మాధానాలు అన్వేషించేట‌ప్పుడు మాత్రం త‌డ‌బ‌డ‌తాయి.
కొన్ని ప్రేక్ష‌కుడు ఛేదించ‌లేని ప‌జిల్‌ని ముందుకు తెచ్చి సాల్వ్ చేయ‌మ‌ని… మెద‌డుకు మేత పెడ‌తాయి.
స‌మాధానం మ‌న‌కు తెలుసు అనుకునేలోగా… మ‌న ఊహ‌కు అంద‌ని మ‌లుపు ఇచ్చి.. మ‌రింత కిక్ పెంచుతాయి.
అలాంటి థ్రిల్ల‌ర్ త‌మిళంలో వ‌చ్చింది. అదే రాక్ష‌స‌న్‌! ఓ థ్రిల్ల‌ర్‌ని భాష‌ల‌కు అతీతంగా ఎక్క‌డైనా రీమేక్ చేయ‌గ‌లిగే ల‌క్ష‌ణాలు రాక్ష‌స‌న్‌లో పుష్క‌లంగా క‌నిపించాయి. అందుకే ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌కుండా తెలుగులోకి తీసుకొచ్చాశారు. రాక్ష‌సుడు పేరుతో.

అరుణ్ ద‌ర్శ‌కుడు కావాల‌ని క‌ల‌లు క‌నే కుర్రాడు. ఓ సైకో థ్రిల్ల‌ర్ క‌థ‌ని ప‌ట్టుకుని సినిమా ప‌రిశ్ర‌మ మొత్తం తిరిగాడు. కానీ.. ద‌ర్శ‌కుడిగా ఒక్క‌రూ అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఇక త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ఆ ఆశ‌ల‌న్నీ వ‌దులుకుని, త‌న తండ్రి కోరిక మేర‌కు ఎస్‌.ఐగా పోస్టింగ్ సంపాదిస్తాడు. తీరా పోస్టింగ్ వ‌చ్చాక‌… ఓ సైకో కిల్ల‌ర్ గురించి ఇన్వెస్టిగేష‌న్ చేయాల్సివ‌స్తుంది. న‌గ‌రంలో వ‌రుస‌గా అమ్మాయిలు మాయం అవుతుంటారు. ఆ త‌ర‌వాత భ‌యంక‌రంగా హ‌త్య‌కు గుర‌వుతుంటారు. ఈ కేసుకు సంబంధించిన కీల‌క‌మైన ఆధారాల్ని ప‌ట్టుకుంటాడు అరుణ్‌. అందుకు త‌న ద‌ర్శ‌కుడి `బుర్ర‌` కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే పై అధికారులు అరుణ్ ఇన్వెస్టిగేష‌న్‌ని లైట్ తీసుకుంటారు. దాంతో… సైకో య‌దేచ్ఛ‌గా త‌న ఆగ‌డాలు కొన‌సాగిస్తాడు. చివ‌రికి.. అరుణ్ మేన‌కోడ‌లు కూడా కిడ్నాప్‌కి గుర‌వుతుంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో అరుణ్ ఏం చేశాడు. డిపార్ట్‌మెంట్ అండ ఏమాత్రం లేకుండా.. ఈ కేస్‌ని ఎలా సాల్వ్ చేశాడు? ఇంత‌కీ వ‌రుస కిడ్నాప్‌లు చేస్తున్న ఆ కిల్ల‌ర్ ఎవ‌రు? అనేదే రాక్ష‌సుడు క‌థ‌.

థ్రిల్ల‌ర్ ల‌కు పెద్ద‌గా క‌థ‌తో ప‌నిలేదు. ఓ సాధార‌ణ‌మైన క‌థ‌ని కూడా కొన్ని మ‌లుపులు జోడించిన థ్రిల్ల‌ర్‌గా రూపొందించొచ్చు. రాక్ష‌సుడు అలాంటి క‌థే. ఓ సైకో… కిడ్నాప్ డ్రామా.. వాడ్ని ప‌ట్టుకోవ‌డానికి హీరో సాస‌సాలు చేయ‌డం ఇవ‌న్నీ – రొటీన్ అంశాలే. కాక‌పోతే.. హీరో ఎలా ప‌ట్టుకున్నాడ‌న్న‌దే.. ప్ర‌తీ క‌థ‌లోనూ సేల‌బుల్ పాయింట్‌. ఈ క‌థ‌లో చిక్కుముడులు చాలా ఉన్నాయి. వాటిని ఎంత తెలివిగా సాల్వ్ చేశాడ‌న్న‌దే ఆస‌క్తిక‌రం. ద‌ర్శ‌కుడి మేథ‌స్సుకు ఇక్క‌డే అగ్ని ప‌రీక్ష ఎదుర‌వుతుంది. ప్రేక్ష‌కుల్ని క‌థ‌లోకి తీసుకెళ్లి, త‌న‌తో పాటు ప‌రిగెట్టించి, త‌న‌లానే ఆలోచింప‌జేసి, ఒక‌వేళ ప్రేక్ష‌కుడు దారి త‌ప్పినా… త‌న దారిలోకి తీసుకొచ్చి క‌థ చెబుతూ.. ప్రేక్ష‌కుడి ఇంటిలిజెన్స్ లెవ‌ల్స్ ఏమాత్రం డిస్ట్ర‌బ్ అవ్వ‌కుండా – చిక్కుముడుల‌న్నీ విప్ప‌గ‌ల‌గాలి. నిజంగా ద‌ర్శ‌కుడికి అదే పెద్ద టాస్క్‌. రాక్ష‌సుడు వ‌ర‌కూ ఇవ‌న్నీ ప‌ర్‌ఫెక్ట్‌గా వ‌ర్క‌వుట్ అయ్యాయి. నిజానికి మాతృక కు క‌థ‌, స్క్రీన్ ప్లే అందించిన ర‌చ‌యిత‌కు ఈ మార్కుల‌న్నీ ప‌డిపోతాయి.

ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాని రీమేక్ చేస్తున్న‌ప్పుడు మార్పులు చేర్పుల‌కు అవ‌కాశం ఉంటుంది. హీరో కోస‌మో, అత‌ని ఇమేజ్ కోస‌మో క‌థ‌ని మార్చొచ్చు. థ్రిల్ల‌ర్‌కి ఆ ఛాన్స్ ఉండ‌దు. ఎందుకంటే… ఇవ‌న్నీ పేక మేడ‌ల్లాంటి క‌థ‌లు. ఎవ‌రి కోస‌మో…. ఒక్క కార్డు త‌ప్పించినా క‌థ మొత్తం కుప్ప‌కూలిపోతుంది. అందుకే కొన్ని క‌థ‌ల్ని… అచ్చుగుద్దిన‌ట్టు తీసేయ‌డ‌మే సేఫ్ గేమ్‌. పైగా మాతృక‌లో ఈ క‌థ విజ‌యం సాధించ‌డానికి స్క్రీన్ ప్లే, అందులో క‌నిపించే మ‌లుపులే అస‌లు కార‌ణ‌మ‌య్యాయి. అందుకే వాటిని మార్చ‌డానికి ద‌ర్శ‌కుడు ఏమాత్రం సాహ‌సం చేయ‌లేక‌పోయాడు. రాక్ష‌స‌న్ ఏ స్క్రీన్ ప్లే ఆర్డ‌ర్ అయితే ఫాలో అయ్యిందో… ఈ రాక్ష‌సుడు కూడా అదే దారిలో నడిపించేశాడు. కొన్ని షాట్లు…. నేరుగా త‌మిళంలోంచే కాపీ పేస్ట్ చేశారు. దాని వ‌ల్ల స‌మయం, డ‌బ్బులు రెండూ ఆదా అయి ఉంటాయి.

సినిమాని చాలా స్లో ఫేజ్‌లో మొద‌లెట్టాడు ద‌ర్శ‌కుడు. ఓవైపు… సైకో, ఇంకో వైపు.. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో నేరేష‌న్‌. మేన‌కోడ‌లు, స్కూలు వ్య‌వ‌హారాలు, హీరో ఆశ‌యాలు… ఇవ‌న్నీ పేర్చుకుంటూ, పేర్చుకుంటూ.. అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌డానికి టైమ్ ప‌ట్టింది. ఒక్క‌సారి క‌థ మెయిన్ రోడ్ ఎక్కాక‌… జోరుగా ప‌రుగులు పెట్టాలి. కాక‌పోతే… అక్క‌డ కూడా.. బండిని 40 కిలో మీట‌ర్ల స్పీడుతో న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. అరుణ్ మేన‌కోడ‌లు మిస్సింగ్ త‌ర‌వాత‌.. క‌థ‌లో వేగం వ‌చ్చింది. ఇక ద్వితీయార్థం మొత్తం ఇన్వెస్టిగేష‌న్ మీదే న‌డుస్తుంది. అక్కడ్నుంచి సినిమా ఒకే ఫేజ్‌లో న‌డుస్తుంది. చిన్న చిన్న క్లూల‌న్నీ ప‌ట్టుకుని… హీరో ఎలా ఇన్వెస్టిగేష‌న్ చేశాడు, అస‌లు హంత‌కుడ్ని ఎలా ప‌ట్టుకున్నాడు? అనేది చాలా డిటైల్డ్‌గా, ఆసక్తిగా చూపించ‌గ‌లిగాడు. అయితే… ఈ డిటైలింగ్ వ‌ల్ల సాగదీత క‌నిపిస్తుంది.

సైకో సైకోగా ఎందుకు మారాడ‌న్న‌ది నిజంగా చూపించాల్సిన విష‌య‌మే. కాక‌పోతే.. దాని కోసం రీళ్ల‌కు రీళ్లు ఖ‌ర్చు పెట్ట‌కూడ‌దు. అలా చేస్తే… అస‌లు క‌థ‌లోంచి ప్రేక్ష‌కుడు డైవ‌ర్ట్ అయ్యే ప్ర‌మాదం ఉంది. రాక్ష‌సుడు విష‌యంలోనూ అదే జ‌రిగింది. హంత‌కుడి కోసం గాలించ‌డం, హంత‌కుడు త‌ప్పించుకుని తిర‌గ‌డం, తీరా దొరికేశాక‌.. అక్క‌డ కూడా క‌థ‌ని ఇంకాసేపు న‌డిపించాల‌ని చూడ‌డం ఇవ‌న్నీ – స్పీడుకు బ్రేకులు వేశాయి. అయితే థ్రిల్ల‌ర్ చిత్రాలు తీసేట‌ప్పుడు స‌స్పెన్స్ ఇంకాసేపు కొన‌సాగించాల‌ని, కొత్త ట్విస్టులు రాసుకోవాల‌ని, క‌థ‌ని మ‌రో ర‌కంగా మ‌లుపు తిప్పాల‌ని ప్ర‌య‌త్నించి, ఆ ఉత్సాహంతో సినిమాని పాడు చేస్తారు. ఇక్క‌డ మాత్రం పిస్తోలు పేల్చ‌డం ఆలస్య‌మైనా, గురి మాత్రం త‌ప్ప‌కుండా రాక్ష‌సుడు త‌న ప‌ని పూర్తి చేయ‌గ‌లిగాడు.

త‌మిళంలో ఎలా ఉందో అలా తీయ్‌… అని ర‌మేష్ వ‌ర్మ‌కి గ‌ట్టిగా చెప్పిన‌ట్టు ఉన్నారు. ఆ మాట‌ని, త‌మిళ సినిమానీ తుచ త‌ప్ప‌కుండా పాటించుకుంటూ వెళ్లాడు. త‌మిళ సినిమా చూసి… రాక్ష‌సుడు చూస్తే…. ఏమాత్రం థ్రిల్ అనిపించదు. మాతృక‌ని మ‌ర్చిపోయి, ఈ సినిమాని కొత్త సినిమాలానే చూడాల్సివ‌స్తుంది. లొకేష‌న్స్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, న‌టీన‌టుల పెర్‌ఫార్మ్సెన్స్ ఈ క‌థ‌ని త‌మ వంతుగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేశాయి. బెల్లంకొండ‌కు క‌చ్చితంగా ఇది కొత్త త‌ర‌హా పాత్రే. త‌ను సిన్సియ‌ర్ ఎఫెర్ట్ పెట్టాడు. త‌న‌లోని హీరో మెటీరియ‌ల్‌ని చూపించ‌డం కోసం పాట‌లు, ఫైటింగులు పెట్టుకోకుండా… క‌థ‌ని ఫాలో అయ్యాడు. కానీ.. త‌న గొంతు చాలా మైన‌స్‌గా మారుతోంది. ఎమోష‌న్ సీన్స్‌లో అది మ‌రింత స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌రొక‌రి డ‌బ్బింగ్‌పై ఆధార‌ప‌డితే…. త‌న పాత్ర మ‌రింత బాగా పండుతుంద‌నిపిస్తోంది. అనుప‌మ‌ది రెగ్యుల‌ర్ హీరోయిన్ పాత్ర కాదు. కేవ‌లం స‌పోర్టింగ్ రోల్ అనుకోవాలంతే. సైకో తో పాటు కొన్ని పాత్ర‌ల్ని త‌మిళంలోంచి దిగుమ‌తి చేసుకున్న‌వే. ఓవ‌రాల్‌గా.. న‌టీన‌టుల‌కు మంచి మార్కులే ప‌డ‌తాయి.

ఇదో త‌మిళ సినిమా అనీ, ఇది రీమేక్ అని పక్కన పెట్టి చూడ‌గలిగితే… రాక్ష‌సుడు త‌ప్ప‌కుండా థ్రిల్ల‌ర్ జోన‌ర్‌ని ఇష్ట‌ప‌డేవాళ్ల‌కు న‌చ్చుతుంది. కాక‌పోతే… స్లో నేరేష‌న్ కాస్త ఇబ్బంది పెడుతుంది. అది త‌ట్టుకోగ‌లిగితే… అన్నింటికంటే ముఖ్యంగా త‌మిళ రాక్ష‌స‌న్ మ‌ర్చిపోగ‌లిగితే… రాక్ష‌సుడు థ్రిల్ ఇస్తాడు.

ఫినిషింగ్ ట‌చ్‌: మ‌క్కీకి మ‌క్కీ

తెలుగు360 రేటింగ్‌: 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆది.. పాన్ ఇండియా సినిమా

సాయికుమార్ త‌న‌యుడిగా ఇండ్ర‌స్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆది. ప్రేమ కావాలి, లవ్లీ సినిమాల‌తో మంచి విజ‌యాలు ద‌క్కాయి. ఆ త‌ర‌వాతే ట్రాక్ త‌ప్పాడు. ప్ర‌తిభ ఉన్నా, అవ‌కాశాలు వ‌స్తున్నా స‌ద్వినియోగం చేసుకోవ‌డం లేదు. ఇప్పుడు...

దేవ‌ర‌కొండ‌.. మిడ‌ల్ క్లాస్ మెలోడీస్!

దొర‌సానితో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు కావ‌డం, రాజ‌శేఖ‌ర్ కుమార్తె హీరోయిన్ గా ప‌రిచ‌యం అవ్వ‌డంతో ఈ ప్రాజెక్టుపై ఆశ‌లు, అంచ‌నాలు పెరిగాయి. కానీ ఆ సినిమా...

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్…!

శరవేగంగా జరుగుతున్న తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు బ్రేక్ వేసింది. సోమవారం వరకూ కూల్చివేతలు ఆపాలని.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతలు నిలిపివేయాలంటూ.. చిక్కుడు ప్రభాకర్ అనే వ్యక్తి దాఖలు...

క‌రోనా టైమ్ లోనూ… క‌నిక‌రించ‌డం లేదు!

క‌రోనా క‌ష్టాలు చిత్ర‌సీమ‌కు కుదిపేస్తున్నాయి. సినిమా రంగం ఈ ఉప‌ద్ర‌వం నుంచి ఇప్ప‌ట్లో బ‌య‌ట‌ప‌డ‌డం క‌ష్ట‌మే. చేయ‌గ‌లిగింది ఏమైనా ఉంటే, అది న‌ష్టాల్ని త‌గ్గించుకోవ‌డ‌మే. అందుకే కాస్ట్ కటింగ్‌, బ‌డ్జెట్ కంట్రోల్ అనే...

HOT NEWS

[X] Close
[X] Close