‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’… దర్శకుడు త్రినాథరావు నక్కిన కెరీర్లో హిట్లు. అలాగే, రామ్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా కంటే ముందు తీసిని సినిమాలు! అంతకు ముందు తనీష్ హీరోగా ‘మేం వయసుకు వచ్చాం’ తీసినా… అది ఎవరికీ గుర్తు లేదు. లాస్ట్ రెండు సినిమాల్లో ప్రేమించిన అమ్మాయి తండ్రితో హీరో ఛాలెంజ్ చేయడం, తరవాత మామను ఎలా మంచి చేసుకున్నాడనే కథను తిప్పి తిప్పి తీశారు. ‘హలో గురు ప్రేమ కోసమే’ కథ కూడా అలాగే వుంటుందా? అని రామ్‌ని అడిగితే ‘‘కథ కొత్తగా వుందని నేను చెప్పను. మనకు తెలిసిన పాయింటే. ఈ యాంగిల్లో కూడా చెప్పవచ్చా? అనేలా వుంటుంది’’ అన్నారు. తన మాటలకు మద్దతుగా ఇటీవల విడుదలైన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా గురించి రామ్ మాట్లాడారు. ‘‘అరవింద… సినిమాలో కాన్సెప్ట్ కొత్తది కాదు. కానీ, దాన్ని తీసిన విధానం బావుంటుంది. మనకు కొత్తగా చూపించారు. మా సినిమా కూడా అలాగే వుంటుంది. కథలో భాగంగా కామెడీ వస్తుంది. స్పెషల్ కామెడీ ట్రాక్స్ ఏం లేవు. జస్ట్ కామెడీ వుందని, సేఫ్ ఫార్ములా అని నేను ఈ సినిమా చేయలేదు. కథలో ఎమోషన్ కూడా నన్ను ఆకట్టుకుంది. కామెడీ డైలాగులోనూ బోల్డంత ఫిలాసఫీ వుంటుంది’’ అని రామ్ చెప్పుకొచ్చాడు.
‘హలో గురు ప్రేమ కోసమే’ విడుదల తరవాత రామ్ ఖాళీ. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన తరవాత పక్కన పెట్టారు. ఆ సినిమా ఆగిపోవడానికి బడ్జెట్ సమస్య ఒక కారణం మాత్రమే అని అతను చెప్పాడు. పూరి జగన్నాథ్‌ని తరచూ కలుస్తానని, తామిద్దరం సినిమా చేయాలని అనుకుంటున్నామని, కథ కుదరడం లేదని రామ్ అన్నాడు. తాను ప్రేమకథల్లో నటించిన ప్రతిసారీ విజయాలు దక్కడం వలన ప్రేక్షకులు వాటిని మాత్రమే గుర్తుపెట్టుకున్నారని, ప్రయోగాత్మక సినిమాలు వర్కవుట్ కాలేదు కనుక వాటిని మర్చిపోయారని ఈ యువ హీరో వ్యాఖ్యానించాడు. భవిష్యత్తులో మంచి కథలు వస్తే ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడానికి, హీరోయిన్ లేని సినిమాలు చేయడానికి తాను సిద్ధమని రామ్ తెలిపాడు.