ఐ బొమ్మ సినిమా ఇండస్ట్రీని ఒక పీడ లాగా పీడించింది. ప్రతి కొత్త సినిమా పైరసీ రూపంలో ప్రత్యక్షమయ్యేది. ఈ పైరసీ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి రవి అరెస్టుతో ఐ బొమ్మ చాప్టర్ క్లోజ్ అయింది. సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఒక్క ఐబొమ్మ అరెస్టుతో పైరసీలో వచ్చే మార్పులు పెద్దగా ఏమీ ఉండవనే కామెంట్లు కూడా వినిపించాయి. పైపెచ్చు ఐ బొమ్మ రవిని మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్లు వైరల్ చేయడం విపరీతమైన ధోరణికి అద్దం పట్టింది. అదలావుంచితే.. నిర్మాతల్లో మాత్రం ఐబొమ్మ అడ్డంకి తొలగడం పై పెద్ద ఆశలు రేపుతున్నట్టుగా అనిపించట్లేదు
ఆఖండ నిర్మాతలు రామ్ ఆచంట గోపి ఆచంట పైరసీ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. పైరసీ దొంగతనం రెండు ఒకటే, ఒక్క దొంగను పట్టుకున్నంత మాత్రాన ఇక ప్రపంచంలో దొంగతనమే ఉండదు అనుకోవడం పొరపాటు. ఐబొమ్మ పోతే మరో బొమ్మ. పైరసీ నిర్మూలనకు ఒక వెబ్సైట్ ని క్లోజ్ చేయడమో, లేకపోతే ఒక ముఠాని పట్టుకోవడం పరిష్కారం కాదు. ప్రజల్లో స్పృహ తీసుకురావాలి. సినిమాని థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేసే లాగా చూసుకోవాలి. అలాగే ప్రభుత్వాలు కూడా కలిసికట్టుగా పనిచేయాలి. కొన్ని దేశాల్లో కొన్ని వెబ్సైట్లు ఓపెన్ అవ్వవు. అలాంటి వ్యవస్థ తీసుకొస్తేనే దీని నిర్మూలన సాధ్యమవుతుంది” అని చెప్పుకొచ్చారు.
నిజమే.. పైరసీ నిర్మూలనది ఒక్కరోజులో అయిపోయేది కాదు. సినిమాని పైరసీలో చూడకూడదనే కల్చర్ ప్రజల్లో మొదలవ్వాలి. అప్పుడే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం దొరికినట్టు అవుతుంది.