సుకుమార్ సినిమాల్లో రెగ్యులర్ హీరోయిజం కనిపించదు. ఫార్ములా జోలికి వెళ్లడు. ఏదో ఓ కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటాడు. అందుకే… అతన్నుంచి ఓ సినిమా వస్తోందంటే సినీ ప్రియులు ఆసక్తిగా అటువైపు ఓ లుక్ వేస్తారు. సుకుమార్ – రామ్‌చరణ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమాపైనా టాలీవుడ్ ఫోకస్ పెరిగింది. చరణ్‌ని ఎలా చూపించబోతున్నాడా? ఈ సినిమాతో కొత్తగా ఏం చెప్పబోతున్నాడా? అంటూ చర్చించుకొంటున్నారు. దానికి తగ్గట్టుగానే తొలి పోస్టర్ తోనే మెగా ఫ్యాన్స్‌కే కాదు, టాలీవుడ్ మొత్తానికి షాక్ ఇచ్చాడు సుకుమార్. ఓ రైతు కావిడ పట్టుకొన్న ఓ ఆర్ట్.. ఫస్ట్ లుక్ పోస్టర్‌గా విడుదల చేశారు. ఆరైతు రామ్ చరణ్ అనుకోవాలా? లేదంటే రైతుల కోసం పాటుపడే కథానాయకుడిగా చరణ్ కనిపిస్తాడనుకోవాలా?? ఏదీ అర్థం కావడం లేదు.
కాకపోతే… ఇప్పుడొస్తున్న సినిమాలకూ, ఇది వరకు చరణ్ చేసిన సినిమాలకూ పూర్తి విభిన్నంగా ఈ చిత్రం ఉండబోతోందన్నది క్లారిటీగా తెలిసిపోయింది. పల్లెటూరి నేపథ్యంలో సినిమాసాగబోతోందన్న విషయం ముందు నుంచీ వినిపిస్తూనే ఉంది. అదీ పక్కానే అని ఈ పోస్టర్ క్లారిటీ ఇచ్చేసింది. చరణ్ చెవిటివాడిలా కనిపిస్తాడని గాసిప్‌లు వినిపిస్తున్నాయి. అదెంత వరకూ నిజమో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి. మైత్రీ మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈరోజే లాంఛనంగా ప్రారంభమైంది. సమంత, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు కెమెరామెన్.