‘సైరా’ వివాదంపై స్పందించిన చ‌ర‌ణ్‌

ఓ ప‌క్క ‘సైరా’ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంటే, మ‌రోవైపు వివాదాలూ త‌గ్గ‌డం లేదు. ‘సైరా’ విష‌యంలో మాకు అన్యాయం జ‌రిగింద‌ని ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి వంశ‌స్థులు వివాదాన్ని రాజేశారు. అది అలా ర‌గులుతూనే ఉంది. ఈ విష‌యం కోర్టులో ఉండ‌డంతో రామ్‌చ‌ర‌ణ్ కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ మాట్లాడ‌లేదు. తాజాగా ఈ విష‌యంపై చ‌ర‌ణ్ స్పందించాడు. వందేళ్లు దాటితే ఎవ‌రి కథైనా చ‌రిత్ర అవుతుంద‌ని, దాన్ని సినిమాగా మ‌ల‌చుకునే హ‌క్కు అంద‌రికీ ఉంటుంద‌ని చ‌ర‌ణ్ గుర్తు చేశాడు. ఈ విష‌యంలో ఇది వ‌ర‌కు న్యాయ‌స్థానాలు ఇచ్చిన తీర్పుని చ‌ర‌ణ్ ఉటంకించాడు.

మంగ‌ళ‌పాండే క‌థ‌ని సినిమాగా తీస్తున్న‌ప్పుడు కూడా ఇలాంటి వివాదాలే వ‌చ్చాయ‌ని, కానీ అవేం నిల‌బ‌డ‌లేద‌న్నాడు చ‌ర‌ణ్‌. ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి దేశం కోసం పోరాడార‌ని, అలాంటి వ్య‌క్తిని ఓ గ్రామానికో, కుటుంబానికో ప‌రిమితం చేయ‌డం ఇష్టం లేద‌ని, సైరా త‌ర‌పున ఏమైనా చేయాల్సివ‌స్తే – ఆ గ్రామానికి స‌హాయం చేస్తామ‌ని చ‌ర‌ణ్ ప్ర‌క‌టించాడు. వంద‌ల కోట్లు ఉన్నంత మాత్ర‌న ఇలాంటి సినిమాలు రావ‌ని, చ‌రిత్ర‌పై గౌర‌వం ఉన్న‌ప్పుడే `సైరా`లాంటి చిత్రాలు రూపుదిద్దుకుంటాయ‌న్నాడు చ‌ర‌ణ్‌. ఈ వ్యాఖ్య‌ల‌తో ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి వంశ‌స్థుల‌కు `సైరా` బృందం చేసేదేం లేద‌ని స్ప‌ష్ట‌మైపోయింది. మ‌రి ఇప్పుడు వాళ్లంతా ఏ వైపుగా అడుగులు వేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com