రామ్ చరణ్ – సుకుమార్… ఈ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం చిత్రాన్ని మెగా అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. చరణ్ కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్ ఇదే అని ఘంటాపథంగా చెబుతారు. సుకుమార్ కు ‘పుష్ప’ లాంటి బ్లాక్ బస్టర్ ఉండొచ్చు. కానీ ఆయన కెరీర్లోనూ బెస్ట్ వర్క్ రంగస్థలమే అన్నది చాలామంది అభిప్రాయం. అందుకే వీరిద్దరూ మళ్లీ ఎప్పుడు కలుస్తారు? మరో సినిమా ఎప్పుడు చేస్తారు? అంటూ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వీరిద్దరి కాంబో ఖాయమైంది. ‘పెద్ది’ తరవాత రామ్ చరణ్ చేసేది సుకుమార్ తోనే. `పుష్ప` తరవాత సుకుమార్ చేసే సినిమా ఇదే కాబట్టి – కచ్చితంగా అంచనాలు భారీగానే ఉంటాయి.
‘పుష్ప 2’ తరవాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని, ఆ తరవాత చరణ్ సినిమా కథపై దృష్టి పెడదామనుకొన్నారు సుకుమార్. కానీ.. ఆయన తన శిష్యుల ప్రాజెక్టులు సెట్ చేసే పనిలో బీజీగా ఉన్నారు. ఈ యేడాది కనీసం ముగ్గురు దర్శకుల్ని తన నుంచి చిత్రసీమకు పరిచయం చేయాలన్న ధ్యేయంతో ఉన్నారు సుకుమార్. ఓ ఓటీటీ సంస్థతో సుకుమార్ టై అప్ అయ్యారని, ఆ సంస్థ తెర వెనుక పెట్టుబడి పెట్టబోతోందని, సుకుమార్ ప్రొడక్షన్లోనే ఈ మూడు సినిమాలూ బయటకు వస్తాయని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు చరణ్ కథ, అందుకు సంబంధించిన ఆలోచనలు కూడా సుకుమార్ బుర్రలో తిరుగుతున్నాయి. చరణ్‌కి ఎలాంటి కథ చేయాలి? ఏ జోనర్లో సినిమా చేయాలి? అనే విషయాలపై సుకుమార్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదట. తన దగ్గర మాత్రం నాలుగు ఐడియాలు ఉన్నాయని, అవన్నీ రామ్ చరణ్‌తో పంచుకొన్నాడని ఇన్ సైడ్ వర్గాల సమాచారం. చరణ్ కూడా `నాకు ఎలాంటి కథ అయినా ఫర్వాలేదు. మీరు డిసైడ్ అవ్వండి` అంటూ పూర్తిగా ఫ్రీ హ్యాండ్ సుకుమార్‌కే ఇచ్చినట్టు తెలుస్తోంది.
సుకుమార్‌కి కథ రాయడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఎలాంటి కథ ఎంచుకొన్నా దానికి సరిపడా బ్యాక్ గ్రౌండ్ సెట్ చేసుకోవాలి. రంగస్థలం, పుష్పలలో బ్యాక్ గ్రౌండ్ లు బాగా వర్కవుట్ అయ్యాయి. పాత కథలే కొత్త ఫ్లేవర్‌లో కనిపించాయి. హీరోయిజానికి బాగా స్కోప్ దొరికింది. అందుకే ఈసారి కూడా కథ కంటే బ్యాక్ గ్రౌండ్ పై వర్క్ చేయడం బెటర్ అనుకొంటున్నాడట సుకుమార్. బ్యాక్ గ్రౌండ్ సెట్ అయిన వెంటనే, స్క్రిప్టు పనులు మొదలు పెడతాడు. ఈలోగా తన శిష్యుల సినిమాల్ని సెట్ చేస్తే అటు గురువుగానూ సుకుమార్ తన బాధ్యతల్ని నెరవేర్చినట్టు అవుతుంది. ‘పుష్ప’, ‘పుష్ప 2’ చిత్రాలకు సహాయకులుగా పని చేసిన ఇద్దర్ని ఆయన ఈసారి దర్శకులుగా వెండి తెరకు పరిచయం చేయబోతున్నారు. వాళ్లెవరన్నది త్వరలో తెలుస్తుంది.