‘శివ’తో తెలుగు సినిమా ఒరవడిని పూర్తిగా మార్చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆ తరవాత కూడా కొన్ని అద్భుతాలు తీశాడు. కానీ ఇప్పటి రాంగోపాల్ వర్మ పూర్తిగా వేరు. ఆ వాడీ, వేడీ ఎప్పుడో పోయాయి. సోషల్ మీడియాలో పోస్టులతోనే కాలక్షేపం చేస్తూపోతున్నాడు. మధ్యమధ్యలో కొన్ని సినిమాలు తీశాడు కానీ, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. ఆయన్ని అమితంగా అభిమానించేవాళ్లు కూడా ‘ఇక చాల్లే వర్మా..’ అంటూ లైట్ తీసుకొంటున్నారు. ఓరకంగా చెప్పాలంటే వర్మ కెరీర్ ఇప్పుడు అధఃపాతాళంలో ఉంది.
అయితే.. మళ్లీ పైకి లేవడానికి ఒక్క సినిమా చాలు. అలాంటి ప్రాజెక్ట్ ఒకటి గప్ చుప్ గా సెట్ చేసుకొంటున్నాడు వర్మ. ‘సిండికేట్’ అనే ఓ స్క్రిప్టు వర్మ రెడీ చేసుకొన్నాడు. ఇది ఇప్పటి వరకూ తీసిన సినిమాల్లా కాకుండా, కాస్త ఖరీదైన చిత్రంగా మలచాలన్నది వర్మ ప్లాన్. వర్మ చాలా చీప్ గా సినిమాలు చుట్టేస్తున్నాడన్న ఓ కామెంట్ తరచూ వినిపిస్తూ ఉంటుంది. దాన్ని వర్మ గమనించినట్టు ఉన్నాడు. అందుకే క్వాలిటీ మేకింగ్ ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించాలని డిసైడ్ అయ్యాడట. అంతేకాదు… టాలీవుడ్ లోని ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఇప్పుడు వర్మతో చేతులు కలపడానికి రెడీ అయ్యింది. ఎంత కావాలంటే అంత పెట్టుబడి పెట్టే ప్రొడక్షన్ హౌస్ దొరికేసరికి వర్మ ఇప్పుడు క్వాలిటీ గురించి బెంగ పెట్టుకోకుండా మేకింగ్ పై శ్రద్ద పెట్టే ఛాన్స్ దొరికింది.
ఈ సినిమాలోని స్టార్ కాస్టింగ్ విషయంలోనూ వర్మ ఫోకస్ చేశాడు. బాలీవుడ్ నుంచి కొంతమంది స్టార్స్ ని ఈ సినిమా కోసం తీసుకురాబోతున్నాడు. తెలుగు నుంచి ఓ అగ్ర హీరో కనిపించున్నాడని టాక్. ఆ కాంబినేషన్ బయటకు వస్తే.. ఫోకస్ అంతా ఈ సినిమాపై మళ్లుతుందని తెలుస్తోంది. ‘ఇంత పెద్ద నిర్మాతనీ, ఇంత పెద్ద హీరోని వర్మ ఎలా పట్టాడా’ అని అందరూ ఆశ్చర్యపోయేలా ఈ కాంబో ఉంటుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఆ కాంబో ఏమిటన్నది రివీల్ కాబోతోంది. జస్ట్.. వెయిట్ అండ్ సీ.