హీరో రామ్ నిర్మాతగా మారే ఆలోచనలో ఉన్నారు. త్వరలో ఓ కొత్త బ్యానర్ స్థాపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు తగిన ఏర్పాట్లు కూడా ఆయన చేసుకొంటున్నారని సమాచారం. ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ తరవాత ఆయన్నుంచి కొత్త సినిమా ప్రకటన ఏదీ రాలేదు. లోకేష్ కనగరాజ్ శిష్యుడు చెప్పిన కథకు ఆయన ఓకే చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాని రామ్ తన సొంత బ్యానర్లో నిర్మించే అవకాశాలు ఉన్నాయి.
‘స్రవంతి మూవీస్’ సంస్థలో రామ్ చాలా సినిమాలు చేశారు. అది కూడా ఆయన సొంత నిర్మాణ సంస్థ లాంటిదే. కొంతకాలంగా స్రవంతి రవికిషోర్ యాక్టీవ్ గా లేరు. అందుకే రామ్ సొంత నిర్మాణ సంస్థ స్థాపించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమా కోసం రామ్ ఓ పాట పాడారు. ఓ పాట రాశారు కూడా. ఇప్పుడు కథకుడిగానూ అవతారం ఎత్తినట్టు తెలుస్తోంది. తన కథతో ఓ సినిమా చేసే ఆలోచన కూడా చేస్తున్నారు రామ్. దానికి సంబంధించిన వివరాలు కూడా త్వరలో తెలుస్తాయి. ఓ మంచి రోజు చూసుకొని రామ్ తన నిర్మాణ సంస్థ పేరుతో పాటుగా, కొత్త సినిమా విషయాల్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

