రామ్ హైపర్ విడుదలకు రెడీ అయ్యింది. అన్నీ అనుకొన్నట్టు జరిగితే రామ్ తదుపరి సినిమా కూడా ఈపాటికే పట్టాలెక్కేసేది. రామ్ కోసం పటాస్, సుప్రీమ్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఓ కథ రెడీ చేసుకొన్నాడు. అది రామ్‌కి వినిపించడం, నచ్చడం.. జరిగాయి. అయితే పారితోషికం విషయంలో కాస్త పేచీ వచ్చి రామ్ వెనక్కి తగ్గాడు. ఆ ప్రాజెక్టు మరొకరి చేతుల్లోకి వెళ్లడానికి రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాపై రామ్ మళ్లీ మనసు మార్చుకొన్నట్టు తెలుస్తోంది. కథ బాగా నచ్చడంతో పారితోషికం తగ్గించుకోవడానికి రామ్ రెడీ అయ్యాడట. వారం పది రోజుల్లో ఈ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. అందుకే అనిల్ రావిపూడి సినిమా ఏమైంది? అని అడిగితే … రామ్ నోరు మెదపడం లేదు. అసలు ఉందా? లేదా? అని సూటిగా అడిగినా సమాధానం చెప్పడం లేదు. ”చర్చల్లో ఉంది.. ఆ సినిమా గురించి తరవాత మాట్లాడదాం..” అంటూ తప్పించుకొన్నాడు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ఈ కథ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లింది. అనిల్ రావిపూడి – ఎన్టీఆర్ మధ్య ఈ కథకు సంబంధించిన డిస్కర్షన్స్ జరిగాయి. ఎన్టీఆర్ ఒక దశలో ఈ కథకు ఓకే చెప్పేద్దామనుకొన్నాడట. అయితే జనతా గ్యారేజ్‌కి భారీ విజయం దక్కడంతో, ఈ దశలో ప్రయోగాలు చేయకూడదని ఫిక్సవ్వడంతో అనిల్ కథ పక్కన పెట్టాడట. అందుకే రామ్ ఈ ప్రాజెక్టుని ఎలాగైనా ఒడిసిపట్టేయాలని చూస్తున్నాడు. ‘అనిల్‌తో సినిమా చేస్తున్నా, చేయట్లేదు’ అంటూ ఏదో ఒకటి తేల్చకపోవడానికి కారణం అదే. తన వరకూ ఈ కథ మళ్లీ వస్తే.. అప్పుడు ఆలోచిద్దాం అని ఫిక్సయ్యాడట. అనిల్ రావిపూడి కూడా ఈ స్క్రిప్టుకి రామ్‌నే బెస్ట్ ఆప్షన్ అని డిసైడ్ అయ్యాడని టాక్. బంతి అనిల్ రావిపూడి కోర్ట్ లో ఉందిప్పుడు. మరోవైపు రామ్ కోసం కరుణాకరణ్ ఓ కథతో రెడీగా ఉన్నాడు. అనిల్, కరుణాకరణ్ రామ్ ఎవరితో ఫిక్సవుతాడన్న విషయం విషయంపై ఓ క్లారిటీ రావాల్సివుంది.