జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో రామ్ తాళ్లూరి ఒక నిశ్శబ్ద విప్లవంలా దూసుకుపోతున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నమ్మకాన్ని చూరగొని, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పార్టీని గాడిలో పెట్టేందుకు ఆయన చేస్తున్న కృషి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. జనసేన పార్టీలో ఇప్పుడు ఎక్కడ చూసినా రామ్ తాళ్లూరి పేరు మారుమోగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తనదైన శైలిలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టారు.
ప్రకటనలు కాకుండా పని తీరుతో మారుస్తున్న రామ్ తాళ్లూరి
కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను ఏకం చేయడంలో ఆయన సఫలీకృతం అవుతున్నారు. ముఖ్యంగా వివిధ నియోజకవర్గాల్లో కొన్నాళ్లుగా సాగుతున్న అంతర్గత విభేదాలకు, ఆధిపత్య పోరాటాలకు చెక్ పెడుతూ పార్టీని ఒకే తాటిపైకి తెస్తున్నారు. చాలా కాలంగా పార్టీ కోసం కష్టపడి, ఎలాంటి గుర్తింపు లేని నిజమైన కార్యకర్తలను రామ్ తాళ్లూరి గుర్తిస్తున్నారు. పైరవీలకు తావులేకుండా, క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా సమర్థులైన వారికి పదవులు దక్కేలా చూస్తున్నారు. గతంలో జిల్లా కమిటీల ఏర్పాటులో కొన్ని వర్గాల మధ్య ఉన్న వైషమ్యాలను ఆయన నేరుగా జోక్యం చేసుకుని పరిష్కరించారు. గ్రూపు రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చే వారిని పక్కన పెట్టి, కేవలం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా క్యాడర్లో భరోసా నింపుతున్నారు.
పూర్తి సమయం పార్టీకే..!
వ్యాపారవేత్తగా, సినీ నిర్మాతగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రామ్ తాళ్లూరి తన పూర్తి సమయాన్ని పార్టీకే కేటాయిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిత్యం అందుబాటులో ఉంటూ, వివిధ నియోజకవర్గాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా, అభ్యర్థుల ఎంపికలో, కమిటీల పునర్నిర్మాణంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి మేలు చేస్తున్నాయని జనసేన కార్యకర్తలు సంతృప్తిగా ఉన్నారు. గతంలో జరిగిన తప్పులను కూడా ఆయన సరి చేస్తున్నారు.
సంస్థాగత బలోపేతమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన వారధిగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియా విభాగం నుండి క్షేత్రస్థాయి కమిటీల వరకు ప్రతి విషయంలోనూ ఒక క్రమశిక్షణను అలవాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ , నాదెండ్ల మనోహర్ ప్రభుత్వ బాధ్యతల్లో నిమగ్నమై ఉన్న తరుణంలో, పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే ట్రబుల్ షూటర్ గా రామ్ తాళ్లూరి తనదైన ముద్ర వేస్తున్నారు. జనసేనలో ఓ సిస్టమ్ ఏర్పాటు కావడానికి రామ్ తాళ్లూరి నిరంతరం శ్రమిస్తున్నారు.
