తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రామచంద్రరావుకు మొదటి సవాల్ సొంత పార్టీ నుంచే ఎదురవుతోంది. ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చాల్సిన అవసరం కనిపిస్తోంది. వీరి మధ్య హుజూరాబాదే పెద్ద సమస్యగా మారుతోంది. ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు. కానీ సుదీర్ఘంగా ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్ ను వదులుకోవాలని అనుకోవడం లేదు. కానీ కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్.. హుజూరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలను బలపరుస్తున్నారు.
ఈటల రాజేందర్ వర్గంగా ఉంటూ బీజేపీ కాదు.. ఈటల మాత్రమే తమ నాయకుడు అనుకుంటున్న వారిని తగ్గిస్తూ వస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో అలాంటి వారికి టిక్కెట్లు దక్కకుండా.. పూర్తిగా తన వారికే చాన్స్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో రాజేందర్ వర్గం కంగారు పడుతోంది. అందుకే ఈటల వద్దకు వచ్చి మొర పెట్టుకున్నారు. ప్రతి పంచాయతీలోనూ తన మనుషులే సర్పంచ్‌లుగా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అది అంత తేలిక కాదని ఈటలకూ తెలుసు. అందుకే వివాదం అక్కడితో ఆగదని అనుకుంటున్నారు.
ఈ ఇద్దరు బీసీ వర్గాలకు చెందిన వారు. ఒకరు బీజేపీలో మొదటి నుంచి ఉన్నారు. రామచంద్రరావుకు అధ్యక్ష పదవి రావడం వెనుక.. బండి సంజయ్ సపోర్టు ఉందన్న ప్రచారం ఉంది. ఈ కారణంగా ఈటల కంటే రామచంద్రరావు బండి సంజయ్ కే సపోర్టుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈటలను బలహీనం చేయాలని రామచంద్రరావు అనుకునే అవకాశం లేదు. వీరిద్దరి మధ్య సమస్యను హైకమాండ్ సాయంతోనే పరిష్కరించాల్సి ఉంది. ఆ ప్రయత్నాలే ప్రస్తుతం రామచంద్రరావు చేస్తున్నారని చెబుతున్నారు.