భారత రాష్ట్ర సమితి డిసెంబర్ 9 అంటే మంగళవారాన్ని విజయ్ దివస్‌గా జరుపుకోవాలని పార్టీ నేతలకు ఒక్క రోజు ముందుగా పిలుపునిచ్చింది. ఈ పిలుపు పార్టీ నేతల్నే కాదు.. రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. డిసెంబర్ 9 అంటే.. తెలంగాణ ఏర్పాటు గురించి చిదంబరం ప్రకటన చేసిన రోజు. కానీ ఆ రోజున బీఆర్ఎస్ గుర్తించడం లేదు. ఏర్పాటు ప్రకటన చేశారు కానీ తర్వాత .. వెనక్కి తగ్గినట్లుగా ఏర్పాటు ప్రక్రియను ప్రకటించారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి నచ్చలేదు. అందుకే డిసెంబర్ 9ని ఎప్పుడూ సెలబ్రేట్ చేయలేదు. అంతే కాదు బీఆర్ఎస్ అలా సెలబ్రేట్ చేయకపోవడానికి కారణం కూడా ఉంది. అదేమిటంటే.. అదే రోజు సోనియాగాంధీ పుట్టిన రోజు.
సోనియా పుట్టిన రోజు నాడే తెలంగాణ ఏర్పాటు ప్రకటన
2009లో కాంగ్రెస్ పార్టీ కావాలనే సోనియాగాంధీ పుట్టిన రోజున తెలంగాణ ఇవ్వాలన్నా నిర్ణయాన్ని ప్రకటించింది. సోనియా పుట్టిన రోజు కానుకగా తెలంగాణ ప్రజల కలలు తీర్చారని ఆ పార్టిీ ప్రచారం చేసుకుంది. చరిత్రలో తెలంగాణ అవతరణకు సోనియాగాంధీకి మధ్య చెరపలేని విధంగా ఓ బంధం ఏర్పాటు అయింది. ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు ఇదే విషయాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే తెలంగాణ సాధన అనే క్రెడిట్ తమదేనని బీఆర్ఎస్ నమ్మకం. అందుకే సోనియా గాంధీ పుట్టిన రోజు కలసి వచ్చే డిసెంబర్ 9ని ఎప్పుడూ పెద్దగా సెలబ్రేట్ చేయలేదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు ఏనాడూ డిసెంబరు 9న ఎలాంటి కార్యక్రమాన్ని జరపలేదు. ఆ రోజు తెలంగాణకు సంబంధించి ఏమీ జరగనట్లే మౌనంగా ఉంటూ వచ్చింది. కేసీఆర్ నిరాహార దీక్ష చేసిన రోజు నవంబరు 29ని దీక్షా దివస్ గా జరుపుతూ వచ్చింది. ఈ ఏడాది కూడా దీక్షా దివస్ చేశారు.
భారీగా వేడుకలు నిర్వహిస్తున్న కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ మరో వైపు తామే తెలంగాణ ఇచ్చామని ప్రజలకు తెలిసేందుకు ఈ ఉత్సవాలను భారీగా నిర్వహిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరిస్తోంది. తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ తాము తీసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అవునన్నా..కాదన్నా.. తెలంగాణ ఏర్పాటు గురించి చిదబరం ప్రకటించింది డిసెంబర9నే. ప్రకంటించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. దాన్ని చెప్పలేరు. అందుకే కాంగ్రెస్ అసలు తెలంగాణ ఏర్పాటు అనే క్రెడిట్ తమదేనని చెప్పుకునేందుకు అవకాశం లభించింది. గత ఏడాది ఉత్సవాలు నిర్వహించారు కానీ బీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఈ సారి కూడా కాంగ్రెస్ అదే పని చేస్తోంది.
విజయ్ దివస్ నిర్వహించాలని కేటీఆర్ నిర్ణయం
తెలంగాణ గురించి ఎలాంటి పాజిటివ్ వార్త వచ్చినా అది తమ ఘనతేనని బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకోవడం సహజం. అయితే డిసెంబర్ 9 విషయంలో సైలెంట్ గా ఉండాల్సి వస్తోంది. అలా చేస్తే.. రాజకీయంగా సమస్యలు వస్తాయని ఇప్పుడు కేటీఆర్ గుర్తించారు. అందుకే.. విధానపరమైన మార్పు తీసుకు వచ్చారు. డిసెంబరు 9ని విజయ దివస్ గా ఒక కార్యక్రమంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. డిసెంబరు 9వ తేదీని విజయ దివస్ గా జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆశ్యర్యపోతున్నాయి.
