ఇండిగో సంక్షోభం గాడిన పడుతోంది కానీ రాజకీయ కుట్రలు మాత్రం పట్టాలెక్కుతున్నాయి. కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడును కొంత మంది టార్గెట్ చేస్తున్నారు. అలా టార్గెట్ చేస్తున్నవారు విపక్షాలకు చెందిన వారు కాదు. తెలుగు వారే. కేంద్ర విమానయానమంత్రిగా .. రామ్మోహన్ నాయుడు తప్పు ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఆయన నిర్లక్ష్యం ఉంటే రాజీనామాకు డిమాండ్ చేయవచ్చు. అన్నీ తెలిసి కావాలని ఇబ్బంది పెట్టి ఉంటే ఆయనను తొలగించాలని డిమాండ్ చేయవచ్చు. కానీ ఇండిగో సంక్షోభంలో రామ్మోహన్ నాయుడు పాత్ర ఎంత ఉందంటే.. ఇప్పుడు ఆయనపై నిందలేస్తున్న వారు ఎవరూ చెప్పలేరు.
కేంద్ర కేబినెట్ లో చిన్న వయసు మంత్రి – సమర్థుడిపై నిందలు
రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్లో చిన్న వయసు మంత్రి. కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయన గత ఏడాదిన్నర కాలంలో అద్భుతమైన పనితీరు చూపించారు. విమానయాన ఇన్ ఫ్రా పెంచేందుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. తెలంగాణకు వరంగల్ ఎయిర్ పోర్టు మంజూరు చేశారు. పనులు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. మరో మూడు ఎయిర్ పోర్టులు ప్రణాళికల్లో ఉన్నాయి. భోగాపురం ఎయిర్ పోర్టును దాదాపుగా పూర్తి చేయించేశారు. దేశంలో ఇతర ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటవుతున్నాయి. విమానయాన రంగంలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎప్పటికప్పుడు ఆయన సమర్థమైన నిర్ణయాలు తీసుకున్నారు.
వ్యాపార సంస్థలు తప్పు చేస్తే కేంద్ర మంత్రిని నిందిస్తారా?
ఇండిగో అనే వ్యాపార సంస్థ ప్లానింగ్ లేకుండా చేసిన తప్పిదం వల్లనే సంక్షోభం వచ్చింది.దానికి రామ్మోహన్ నాయుడు ఏం చేస్తారు?. ఒక చిన్న లాజిక్ మిస్సయ్యారు. నిజానికి వ్యాపార సంస్థల విషయాలను చూడాల్సింది.. డీజీసీఏ. ఆ సంస్థ పెట్టిన షరతులను.. ఇండిగో పాటించడానికి ఏర్పాట్లు చేసుకుందా లేదా అని చెక్ చేయాల్సింది డీజీసీఏనే. అలాంటి వివరాలు మంత్రి వద్దకు వస్తాయా?. రైల్వే ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే మంత్రిని నిందిస్తారు..కానీ అందులో ఆయన పాత్ర ఏమైనా ఉంటుందా?. పాలసీ పరమైన తప్పులు జరిగితే ప్రభుత్వం కచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందే. కానీ ఇండిగో విషయంలో జరిగిందేమిటి?
రామ్మోహన్ ను బలహీనపరిస్తే ఎవరికి నష్టం?
దక్షిణాది నుంచి ఢిల్లీలో ప్రభావం చూపగల నేతలు లేరు. అన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ.. తన పనితీరుతో అందర్నీ ఆకట్టుకుంటున్న రామ్మోహన్ నాయుడు రేపటి రోజు దక్షిణాదికి ఢిల్లీలో పెద్ద వాయిస్ అవుతారు. ఆయనను ఎంతగా డీఫేమ్ చేస్తే అంతగా నష్టపోయేది దక్షిణాదినే. ఆయన తప్పు ఉంటే నిందించినా తప్పు లేదు కానీ.. కుర్రాడు ఎదిగిపోతున్నాడన్న కుళ్లుతో తప్పుడు ఆరోపణలు..ప్రచారాలు.. చేసి.. బలి చేయాలని ప్రయత్నిస్తే .. కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లు అవుతుంది.
