సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులవారు ములాయం సింగ్ యాదవ్ గారికి వయసు పెరుగుతున్నకొద్దీ కొత్తకొత్త అనుమానాలు తలెత్తుతుంటాయి. ఇప్పుడు ఆయనగారి డౌటేమిటంటే, నలుగురు రేప్ ఎట్టా సాధ్యం ?! `గ్యాంగ్ రేప్’ అన్న పదం అర్థంలేనిదన్నదే ఆయనగారి వాదనలా కనబడుతోంది. వివరాల్లోకివెళితే…
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్టగా పేరుబడిన ములాయం ఇప్పుడు ఈ సంచలన వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉన్నదన్న విషయం చెబుతూ, అత్యాచార కేసుల్లో రేప్ చేసింది ఒక వ్యక్తి అయితే, నలుగురి పేర్లు ఫిర్యాదులో రాస్తున్నారని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగితే ఆయన ములాయం ఎలా అవుతారు. దానికి కొనసాగింపుగా, `నలుగురు వ్యక్తులు రేప్ చేయడం ప్రాక్టికల్ గా ఎలా సాధ్యం…? ‘ అని ప్రశ్నిస్తూ మరో సంచలనానికి తెరతీశారు.
`ఒక మనిషి రేప్ చేస్తే, నలుగురుపేర్లు రాస్తున్నారు. కభీఐసా హోసక్తాహై క్యా? ఐసా ప్రాక్టికల్ హి నహీన్ హై’ అని తేల్చిపారేశారు. లక్నోలో రాష్ట్రప్రభుత్వ కార్యక్రమం క్రింద ఉచితంగా రిక్షాలు అందజేసే కార్యక్రమంలో ములాయం మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అత్యాచార కేసుల విషయం పెద్దాయన ప్రస్తావిస్తూ, దేశంలోనే ఇలాంటి కేసులు ఉత్తరప్రదేశ్ లోనే తక్కువగా నమోదవుతున్నాయని అంటూ … `ఉత్తరప్రదేశ్ జనాభా 21కోట్లు, అదే మధ్యప్రదేశ్ జనాభా 6కోట్లు. మరి అక్కడ (ఎంపీలో) రేప్ కేసుల శాతం 9.8 ఉంటే, ఇక్కడ యుపీలో అది రెండుమాత్రమే. పైగా, రాజస్థాన్ లో బీజేపీ పాలనలోఉన్న రాష్ట్రంలో ఇది ఏడుశాతంగా ఉంది. ఇక ఢిల్లీ సంగతి చెప్పనక్కర్లేదు. అక్కడ నేనుఉంటానుకనుక ఆ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి, తక్కువ శాతం అత్యాచారకేసులున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి… ‘ అంటూ తన రాష్ట్ర ప్రత్యేకతను ఇలా చాటిచెప్పారు. ఈ ఉత్సాహంలో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు తాజాగా వివాదాస్పదమయ్యాయి.
క్రిందటేడాది ములాయం ఇలాగే తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. అత్యాచార విషయంలో మగపిల్లలను సమర్థిస్తూ మాట్లాడారప్పుడు. `లడకే, లడకే హైన్. గల్తీహో జాతి హై…’ (అబ్బాయిలు అబ్బాయిలే, వారు పొరపాట్లు చేస్తుంటారు)అంటూ మాట్లాడేశారు. అత్యాచారాలన్నవి ఏవో పొరపాట్లే, వాటి గురించి సీరియస్ గా పట్టించుకోకుదన్న అర్థం వచ్చేలా మాట్లాడారు.
అంతేనా అంటే ఇంకా ఉన్నాయి. అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహం ఉన్నంతవరకూ ఏమీ ఉండదు, అదే స్నేహం బెడిసికొట్టినప్పుడు గగ్గోలు పెడుతూ `రేప్..రేప్’ అంటారంటూ వ్యాఖ్యలు చేసేసరికి మహిళాలోకం భగ్గుమంది. `ఆడపిల్లలు మొదట్లో అబ్బాయిలతో స్నేహం చేస్తారు. తేడాలు రాగానే వాళ్లు రేప్ కేసులు పెడతారు. మగపిల్లలు పొరపాట్లు చేస్తారు. అంతమాత్రాన ఉరితీస్తారా ?’ అంటూ కఠినశిక్షలపై విరుచుకుపడ్డారు ములాయం.
ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలపై సభ్యసమాజస్పందన ఎలాఉంటుందో చూడాలి. మరీ ముఖ్యంగా మహిళా సంఘాలు, అభ్యుదయ సంఘాలు విరుచుకుపడటం ఖాయం. అయినా ములాయం మాత్రం మారరనే అనిపిస్తోంది. ఆయన విభిన్న ఆలోచనలకు పదునుబెడ్తూ సంచలనవ్యాఖ్యలు చేస్తునేఉంటారు. అదే `ములాయమిజం’.
– కణ్వస