సెటైర్:కుక్కలు మాయం !

ఉన్నట్టుండి కుక్కలన్నీ మాయమైపోయాయి. అప్పటిదాగా కసురుకున్న, విసుక్కున్న వాళ్లే కుక్కలు కనపడకపోయేటప్పటికీ విస్తుపోయారు. హఠాత్తుగా కుక్కలన్నీ మాయమవడమేమిటో తెలియక తికమకపడ్డారు. అసలిదంతా ఎలా జరిగిందో అర్థంకాలేదు. అయితే, ఇలా జరగడానికి ఓ రీజన్ ఉంది. రెండురోజుల కిందటిమాట అది…

వీధికుక్కలు, ఊర కుక్కలు, పెంపుడు కుక్కలు, పోలీసు కుక్కలు, పిచ్చికుక్కలు ఒకటేమిటీ మనదేశంలో ఉన్న అన్ని బ్రాండెడ్ కుక్కలు ఒక చోట సమావేశమయ్యాయి. తమ క్షేమం కోసం జాతీయస్థాయి సమావేశాన్ని హైదరాబాద్ లో పెట్టారని తెలిసినప్పటినుంచీ అదేపనిగా తోకాడిస్తూ, భౌబౌ..అంటూ అరుస్తూ, కనిపించినవాళ్లను బెదరిస్తూ , వీలుచిక్కితే కరిచేస్తే తమ ఆనందాన్ని వ్యక్తంచేస్తున్నాయి. ఛలో హైదరాబాద్ అంటూ లక్షలాది కుక్కలు రైళ్లు, బస్సులు ఎక్కేసో, నాలుగుకాళ్లకు పనిచెప్పో చకచకా సభాస్థలికి వచ్చేశాయి.

స్టేడియం గ్రౌండ్ అంతా కుక్కలతో కిటకిటలాడిపోతోంది. తెల్లకుక్కలు, నల్లకుక్కలు, తెల్లమచ్చల కుక్కలు, నల్లమచ్చల కుక్కలు, బొచ్చుకుక్కలు, బోడికుక్కలు, జూలుకుక్కలు, నక్కమూతి కుక్కలు, పిల్లిమూతి కుక్కలు…ఇలా ఎన్నో రకాల కుక్కలతో స్టేడియం సందడిగా ఉంది.

`సైలెంట్..నిశ్శబ్దం… మీరంతా అలా మొరుగుతుంటే నేను చెప్పేది మీకు వినిపించదు. సైలెంట్… ‘ ఇలా అధ్యక్షులవారు అనగానే వేలాది కుక్కలు అదోపద్ధతి ప్రకారం తోకలాడిస్తూ, నాలుక బయటపెట్టి మూతులను నాక్కుంటూ సైలెంట్ అయిపోయాయి.

`అఖిలభారత కుక్కలారా, మనమంతా వన్యమృగాలమా? లేక పెంపుడు జంతువులమా? తేల్చుకోవాల్సిన సమయం అసన్నమైంది. ఈ మానవులున్నారే, వాళ్లు బహుస్వార్థపరులు. తమ అవసరాలకోసం మనల్ని వాళ్ల ఇంటిముందు కట్టేస్తారు. ఒక ముద్దపడేసి రాత్రిపగలూ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేయమంటారు. ఇదే పనిని ఏ మనిషిచేతనో చేయిస్తే చాలా డబ్బు ఖర్చుఅవుతుందని తెలిసే మనజాతికి అంటగట్టారు. నైట్ డ్యూటీ చేసి పగలు కాసేపు పడుకుంటేచాలు, సోమరిపోతువంటూ కొట్టిలేపుతున్నారు. వాళ్లంతా డబుల్ కాట్ లమీద పడిదొర్లుతున్నా, మనంమాత్రం ఇంట్లో ఓమూల ముడుచుకుని పడుకోవాల్సివస్తోంది. రానురానూ ఈ మానవుల ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. ఎక్కడో,ఎదో ఒక కుక్క కరిస్తే అందర్నీ పట్టుకెళుతున్నారు. ఇది చాలా అన్యాయం. మనకు స్వేచ్ఛగా జీవించే హక్కును ఆ భగవంతుడు ఇచ్చాడు. దాన్ని హరించడం అన్యాయం ‘

అంతలో వరంగల్ జిల్లానుంచి వచ్చిన ఓ కుక్క లేచి…

`అధ్యక్షా, నామీద పోకిరీపిల్లలు రాళ్లు విసురుతుంటే నాకు కోపంవచ్చి ఓ ఆరుగుర్ని కరిచినమాట వాస్తవమే. అంతమాత్రాన ఊర్లో కుక్కలన్నింటికీ పిచ్చిపట్టిందంటూ ప్రచారం చేయడం అన్యాయం. ఆమాటకొస్తే పిచ్చిలేనిదెవరికని అడుగుతున్నాను. ఒకరికి పదవుల పిచ్చి. మరొకాయనకు సీఎం కుర్చీమీద పిచ్చి, ఇంకో అతనికి ప్రాంతీయతత్వపిచ్చి, ఒకామెకు నగలమీద పిచ్చి, ఇంకామెకు తనవిగ్రహాలమీద పిచ్చి, మరో ఆమెకు తనకొడుకుమీద పిచ్చిప్రేమ… ఇంత మంది పిచ్చివాళ్లుంటే, వాళ్లందర్నీ వదిలేసి పిచ్చికుక్కలంటూ మనకు బ్రాండ్ వేయడం అన్యాయం, ఈ వివక్ష నశించాలి ‘

`అవునవును, నశించాలి…నశించాలి ‘ మిగతా కుక్కల కోరస్.

`అవును మిత్రమా, నువ్వుచెప్పింది నిజమే. ఇలాంటి అన్యాయాలను ప్రతిఘటించాలి. ఒక్కసారి మనంలేని సమాజం ఎలా ఉంటుందో వాళ్లకు రుచిచూపించాలి. అందుకే ఓ నాలుగురోజులపాటు ఊర్లను మనమే బహిష్కరించాలి. మనం లేకపోతే దోపిడీ దొంగలు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఎలా విరుచుకుపడతారో వాళ్ళకు తెలియాలి ‘ అధ్యక్షులవారి నిర్ణయం.

`అవునవును, మనమంతా ఊర్లను బహిష్కరించి అడవుల్లోకి వెళ్ళిపోదాం. అప్పుడు తెలిసొస్తుంది వాళ్లకు ‘ కుక్కజాతులన్నీ వంతపాడాయి.

ఇంతలో బొంబాయి నుంచి వచ్చిన కుక్క అందుకంటూ …

`మిత్రులారా, పెంపుడు కుక్కలకు కూడా ఇష్టాఇష్టాలుంటాయి. ఎంతసేపూ యజమానుల వెంట తోకాడించుకుంటూ తిరగాలంటే కష్టమే. మనకు మాత్రం వేరే పనులుండవా? పెంపుడు కుక్కల పరిస్థితి మరీదారుణంగాఉంది. వీధి కుక్కలకున్న స్వేచ్ఛ వారికి లేదు. గృహనిర్భంధంలో క్రుంగిపోతున్నాయి. ఇవన్నీ ఏ మీడియా కవర్ చేయడంలేదు. ఏ విలేఖరి మనపాట్ల గురించి రాయడంలేదు. బాలకార్మికుల చట్టం కానీ, లేదా గృహనిర్బంధ నిరోధక చట్టం కానీ మనపట్ల అమలుకావడంలేదు. మనకూ ప్రత్యేక చట్టాలుండాల్సిందే. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే సతీమణి శర్మిలను వారి పెంపుడు కుక్క కరచినట్టు, ఆమెడగారి ముఖానికి 65 కుట్లు పడినట్టు ఇప్పుడే ఒక వార్తొచ్చింది. సరే, తప్పు మనకుక్కదే అనుకుందాం. అయితేమాత్రం మన బాధల గురించి పట్టించుకోని మీడియా, ఇలాంటి వార్తలను హైప్ చేస్తూ, మనజాతిని అవమానపరుస్తున్నది…అవునంటారా, కాదంటారా? ‘

`అవును, అవునవును. మీడియా ఎప్పుడూ మనపట్ల నెగెటీవ్ వార్తలే ఇస్తోంది. పిచ్చికుక్కల స్వైరవిహారమనో, ఊర్లో గ్రామసింహాల బెడద అనో గంటలపాటు టివీల్లో చూపిస్తున్నారు. ఇలా పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేస్తున్న ఛానెళ్లవారికి మనమెందుకు నోటీసులు పంపకూడదు…? ‘

`అవును, పంపాల్సిందే, ఈ ఛానెళ్లవారికి నోటీసులు పంపాల్సిందే ‘ – సర్వకుక్కలు ఆమోదం తెలిపాయి.

సమావేశం ముగియగానే కుక్కలు సమైక్యంగా పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళిపోయాయి. దీంతో కుక్కలు కనబడక జనం కంగుతున్నారు. అయోమయంలో పడిపోయారు. అప్పుడు టివీల్లో వచ్చిన వార్తల హెడ్ లైన్స్ ఇలా ఉన్నాయి…

1. పెంపుడు కుక్కల యజమానులకు పిచ్చి.
కుక్కల జాడ తెలియక మనోవేదన.

2. వీధి కుక్కల్లేక పల్లెల్లో పెరిగిన చోరీలు.
కుక్కల రాకకోసం బొమ్మల పెళ్లిల్లు.

3. కుక్కల్లేక బతకలేమంటున్న జంతు ప్రేమికులు.
సెల్ టవర్లెక్కి ఆత్మహత్యాయత్నాలు

4. కుక్కల రక్షణ కోసం ప్రత్యేక చట్టం కోరుతున్న ప్రతిపక్షం.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రేపు ధర్నా.

5. కుక్కల నాయకులతో ప్రభుత్వ చర్చలు.
ఫలప్రదం కావాలని అంతటా ప్రత్యేక పూజలు.

6. కుక్క వార్తలు లేక అనేక ఛానెళ్లకు పడిపోతున్న రేటింగ్స్.
తిరిగివచ్చేలా చూడాలని ప్రభుత్వానికి మీడియా సంఘాల వినతి.

మీడియాలో వస్తున్న వార్తలగురించి తెలుసుకున్న సర్వశునకజాతులు సంతోషించాయి. అల్పసంతోషులు కావడంతో ఆనందంలో గెంతుకుంటూ మళ్లీ ఊర్లలోకి ప్రవేశించాయి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close