మాస్ అంటేనే రవితేజ.. రవితేజ అంటేనే మాస్. తన సినిమాలన్నీ ఇదే ఫార్మెట్ లో తయారవుతుంటాయి. ‘మాస్ జాతర’ కూడా ఇందుకు మినహాయింపు కాదు. పైగా టైటిల్లోనే మాస్ వుంది. ఆమధ్య రిలీజ్ చేసిన టీజర్లో.. ఇప్పుడు వదిలిన ట్రైలర్లో కూడా మాసే. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈనెల 27న విడుదల చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన సినిమా ఇది.
ట్రైలర్లో కొత్త విషయాలేం లేవు. హీరో క్యారెక్టర్ని పరిచయం చేస్తూ బిల్డప్పులు ఇచ్చుకొంటూ వెళ్లారు. శ్రీలీలతో.. రొమాన్స్ ఉండనే ఉంది. ఓ డైలాగ్ కావాలనే బీప్ చేశారు. రవితేజ ఈ సినిమాలో రైల్వే పోలీస్‌గా కనిపించబోతున్నారు. ఆయన పోలీస్ పాత్రలు ఇది వరకు చాలా చేశారు. ‘క్రాక్’లో రవితేజ గెటప్ గుర్తొచ్చింది. కాకపోతే క్రాక్‌లో సీరియస్ పోలీస్.. ఇక్కడ రవితేజ స్టైల్ ఆఫ్ కామెడీ మిక్స్ చేసిన పోలీస్ పాత్ర. హీరో ఎలాంటి వాడో కొన్ని డైలాగులతో చెప్పించారు. బిల్డప్ షార్ట్స్‌కి లోటు లేదు. మాస్లో ముంచి తీసిన సినిమాలా అనిపించింది. భీమ్స్ అందించిన పాటలు ఇప్పటికే క్లిక్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా సాగింది.
చివర్లో ‘అడ్రస్స్ పెట్టు’ అనే మీమ్ డైలాగ్ ని రాజేంద్ర ప్రసాద్ తో పలికించారు. మీమ్స్ లో పాపులర్ అయిన డైలాగుల్ని వాడుకోవడం ఈమధ్య బాగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న డైలాగుల్ని పట్టుకొంటే బాగుండేది.