రవితేజ పరిస్థితేం బాలేదు. సినిమాలు వరుస పెట్టి చేస్తున్నాడు కానీ, అన్నీ ఫ్లాపులే. ‘ధమాకా’కు ముందూ వెనుక రవితేజకు హిట్లేం లేవు. చేతిలో ‘మాస్ జాతర’ సినిమా ఉంది. చాలాసార్లు విడుదల తేదీ ప్రకటించి, ఆ తరవాత వాయిదా వేశారు. ఈనెల 31న రిలీజ్కు రెడీ అయ్యింది. ఈసారి డేట్ మార్చేది లేదంటూ.. నిర్మాత నాగవంశీ కూడా గట్టిగా చెప్పారు. ప్రమోషన్లు కూడా మొదలయ్యాయి. అయితే ఈ సినిమాపై ‘బాహుబలి ఎపిక్’ ప్రభావం గట్టిగా ఉండేట్టు కనిపిస్తోంది.
బాహుబలి 1, బాహుబలి 2.. రెండు భాగాల్ని బాహుబలి ఎపిక్ పేరుతో ఈనెల 31నే రీ రిలీజ్ చేయబోతున్నారు. మామూలుగా అయితే రీ రిలీజులు చూసి పెద్ద సినిమాలు భయపడవు. ఆ ఎఫెక్ట్ చిన్న, మీడియం రేంజ్ సినిమాలపై ఉంటుంది. కాకపోతే.. ఇది రాజమౌళి ప్రొడక్ట్. ఆయన ప్రతీదీ ప్లాన్ ప్రకారం చేస్తుంటారు. ‘బాహుబలి ఎపిక్’కు గట్టిగా ప్రమోషన్లు చేయాలన్నది ఆయన ప్లాన్. అందుకోసం ప్రభాస్ ని సైతం రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లానింగ్ లో వుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో ఈ సినిమాని ప్రదర్శించబోతున్నారు. టికెట్ రేట్లు కూడా అందుబాటులో ఉంచుతారు. రీ రిలీజుల్లో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా ‘బాహుబలి ఎపిక్’ నిలిచే ఛాన్స్ వుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలే రవితేజ సినిమాలు అంతంత మాత్రమే ఆడుతున్నాయి. తనకు ఓ సాలీడ్ హిట్ అవసరం. ఈ దశలో.. బాహుబలితో వసూళ్లకు గండి పడే ప్రమాదమే ఎక్కువ కనిపిస్తోంది. పోనీ.. రిలీజ్ డే మారుద్దామంటే, ఇప్పటికే చాలాసార్లు వాయిదా వేశారు. మరోసారి కూడా వాయిదా అంటే… ప్రోజెక్ట్ అవుడ్డేటెడ్ అయిపోతుంది. అందుకే బాహుబలితో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అవాంతరాన్ని నాగవంశీ ఎలా దాటుకొంటూ వెళ్తాడో చూడాలి.