మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం.. ఇలాంటి సినిమాలతో అలరించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ. క్లాస్, ఫన్, క్రైమ్, యాక్షన్… ఇలా అన్ని జోనర్లూ టచ్ చేశాడు. ఇప్పుడు ఓ సరికొత్త కథతో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. `సరిపోదా శనివారం` తరవాత వివేక్ సినిమా ఎవరితో అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఆయన ఓ మాస్, యాక్షన్ కథతో హీరోలను ఎప్రోచ్ అవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా రవితేజతో వివేక్ భేటీ వేశారని సమాచారం. రవితేజకు వివేక్ ఓ కథ చెప్పారని, అది దాదాపుగా ఓకే అయ్యిందని ఇన్ సైడ్ వర్గాల టాక్.
రవితేజ నుంచి ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమా వస్తోంది. ఆ తరవాత శివ నిర్వాణతో ఓ సినిమా చేయబోతున్నారు. దీనికి ‘ఇరుముడి`’అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇది ముగిశాకే… వివేక్ ఆత్రేయ సినిమా పట్టాలెక్కుతుంది. ‘భర్త మహాశయులకు’ రవితేజ కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా. రెండేళ్లుగా ఆయన్ని పరాజయాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ‘భర్త మహాశయులకు’, ‘ఇరుముడి’ చిత్రాల కోసం రవితేజ పారితోషికం తీసుకోకుండా పని చేస్తున్నారు. సినిమా లాభాల్లో వాటా ప్రాతిపదికన ఆయన సినిమాలు చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ సినిమా కూడా అంతే.