రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే దిశగా ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లు శరవేగంగా అడుగులు వేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో డెవలప్ అవుతున్న ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరి పోస్తున్నాయి. ఓర్వకల్లులో సుమారు రూ. 2,786 కోట్లు, కొప్పర్తిలో రూ. 2,136 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుండటంతో, ఇన్వెస్టర్ల చూపు సీమ వైపు మళ్లింది. ముఖ్యంగా పారిశ్రామిక అవసరాల కోసం ఏర్పాటు చేస్తున్న ప్లగ్-అండ్-ప్లే మౌలిక వసతులు అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తున్నాయి.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ , ఈవీ హబ్‌గా మారుతోంది. రిలయన్స్, ఇటోయే మైక్రో టెక్నాలజీ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ భారీ పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకోవడంతో స్థానికంగా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. విమానాశ్రయం , జాతీయ రహదారుల అనుసంధానత ఉండటంతో ఓర్వకల్లు పరిసరాల్లోని గెట్టేపాడు, ఉప్పలపాడు వంటి గ్రామాల్లో ఓపెన్ ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పారిశ్రామికవేత్తలతో పాటు ఐటీ, లాజిస్టిక్స్ రంగాల ప్రతినిధులు ఇక్కడ స్థిరాస్తి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
మరోవైపు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడలో ఎలక్ట్రానిక్స్ , టెక్స్టైల్ పరిశ్రమలు కొలువుదీరుతున్నాయి. ఇక్కడ సుమారు లక్ష మందికి ఉపాధి లభించే అవకాశం ఉండటంతో, భవిష్యత్తులో గృహ అవసరాలు భారీగా పెరుగుతాయని రియల్టర్లు అంచనా వేస్తున్నారు. కేవలం పారిశ్రామిక భూములే కాకుండా, చుట్టుపక్కల ఉన్న సాగు భూములు ఇప్పుడు వెంచర్లుగా మారుతున్నాయి. వాక్-టు-వర్క్ సంస్కృతిని ప్రోత్సహించేలా గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం కోసం పెద్ద కంపెనీలు భూసేకరణ చేస్తున్నాయి.
రాయలసీమలో పారిశ్రామికీకరణ కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక సరికొత్త శిఖరానికి తీసుకెళ్తోంది. ప్రభుత్వం ఇక్కడ మౌలిక సదుపాయాల కోసం హడ్కో వంటి సంస్థల నుంచి వేల కోట్ల రుణాలు సేకరించి అభివృద్ధి చేస్తుండటం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది.
