30వ రాష్ట్రంగా రాయలసీమ – రాజుకుంటున్న ‘ప్రత్యేక’ ఉద్యమం

హైదరాబాద్: అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంకోసం చాపకింద నీరులా అక్కడ ఒక బలమైన ఉద్యమం రూపుదిద్దుకుంటోంది. ప్రజలలో ఉన్న అసంతృప్తిని ఉద్యమంగా మలిచేందుకు ‘రాయలసీమ రాష్ట్ర సమితి’ అని, ‘రాయలసీమ అభివృద్ధి వేదిక’ అని, ‘రాయలసీమ పరిరక్షణ సమితి’ అని, ‘రాయలసీమ సోషల్ మీడియా ఫోరమ్’ అని, ‘రాయలసీమ అధ్యయన సమితి’ అని, ‘రాయలసేన’ అని అనేక సంస్థలు తయారయ్యాయి. మరోవైపు విద్యావంతుల అసంతృప్తికి సోషల్ మీడియా వేదికగా మారింది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఎక్కడెక్కడి సీమవాసులంతా ఆ వేదికద్వారా అనుసంధానమవుతున్నారు. దేశంలో 30వ రాష్ట్రంగా రాయలసీమ ఏర్పాటే తమ ధ్యేయమంటున్నారు.

శ్రీబాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కి రాజధానిని ఆంధ్రాలో ఏర్పాటు చేశారన్నది సీమవాసుల మొట్టమొదటి ఫిర్యాదు. సీమలో అభివృద్ధిని విస్మరించి జీవో 120, పట్టిసీమ వంటి వాటితో అన్యాయం చేస్తున్నారని ఆరోపణ. అమరావతిని రాజధానిని చేసి అభివృద్ధిమొత్తం ఆ చుట్టూరానే జరగబోతుందని సీమవాసుల్లో భయాందోళనలు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి సాగునీటి ప్రాజెక్ట్‌లను చేపట్టకపోగా – విభజనబిల్లు ప్రకారం రాయలసీమలో(కర్నూలు జిల్లాలో) ఏర్పాటు కావలసిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలనుకూడా ఇతర జిల్లాలకు తరలిస్తున్నారని ఆవేదన.

అభివృద్ధిలో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, తమను నిర్లక్ష్యం చేస్తున్నారని సీమవాసుల అసంతృప్తి రాజధానిని అమరావతిలో ఏర్పాటుచేయటంతో రెట్టింపయింది . సీమలోని సాగునీటి ప్రాజెక్టులను వదిలేసి పట్టిసీమను శరవేగంగా రు.1,500 కోట్లు ఖర్చుపెట్టి పూర్తి చేశారని ఆరోపిస్తున్నారు. హంద్రి-నీవా ప్రాజెక్ట్‌కు చెందిన ఒక పంపును పట్టిసీమకు తరలించటం వారిని మరింత రెచ్చగొట్టినట్లయింది. ఆ రు.1,500 కోట్లు ఖర్చు పెడితే హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులు పూర్తయిపోయేవని సీమవాసులు అంటున్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ కోసం విడుదల చేసిన జీవోలో శ్రీశైలం ప్రాజెక్ట్‌నుంచి రాయలసీమకు తరలించటంగురించి పేర్కొనకపోవటంతోకూడా సీమవాసులలో ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు ఏర్పడ్డాయి.

విభజన బిల్లులో పేర్కొన్న ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలో – అనంతపూర్‌లో ఏర్పాటవుతున్న సెంట్రల్ యూనివర్సిటీ తప్పితే – ఒక్కటికూడా సీమకు రాలేదు. కర్నూలును ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూడటమేగానీ ఆ జిల్లాలో ఒక్క ఐఐటీ తప్పితే మరే ప్రాజెక్టూ ఏర్పాటవలేదు. కడప జిల్లాలో ఎయిమ్స్, హైకోర్ట్ బెంచ్ ఏర్పాటవుతాయని మాటలేగానీ, చేతల్లో ఒక్కటీ రాలేదు. పెట్రోలియం యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ వంటివన్నీ కోస్తాకెళ్ళిపోయాయి. ఇవికాక విజయవాడ, విశాఖపట్నాలకు మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్ట్‌లు ప్రకటించటం సీమవాసులలో అసంతృప్తిని ఎగదోసినట్లయింది.

ఇక రాజకీయంగా చూస్తే – ప్రభుత్వం సీమపట్ల సవతితల్లి ధోరణి ప్రదర్శిస్తోందని ప్రతిపక్షాల నాయకులేకాదు సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, అనంతపూర్ ఎంపీ జేసీ దివాకరరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, సీమ ప్రజలు ఈ విషయంలో అదే ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడునిగానీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డినీ నమ్మటంలేదు. జగన్ ఇటీవల ప్రత్యేకహోదాకోసం గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేస్తే సీమలో మద్దతుగా ఒక్కచోటకూడా చెప్పుకోతగ్గ ఆందోళన జరగకపోవటమే దీనికి నిదర్శనం. దీనికి కారణం కూడా జగనే. ఆయన రాయలసీమ వాసుల ఆందోళనకు మద్దతివ్వటంగానీ, సమర్థించటంగానీ చేయటంలేదు. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి – సీమవాసుల ఆందోళనను మద్దతిస్తే కోస్తాలో పట్టు పోతుందని, రెండు – ఎప్పటికైనా 13 జిల్లాలతోకూడిన రాష్ట్రాన్ని తాను ఏలాలన్న కోరిక.

మరోవైపు ఒక బలమైన ఉద్యమం సీమలో రూపుదిద్దుకుంటుండగా, చంద్రబాబునాయుడు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవటం ఒక ఆశ్చర్యకరమైన విశేషం. ఇది – ఉద్యమ తీవ్రతను గుర్తించటంలో ఇంటలిజెన్స్ వైఫల్యమా, ప్రభుత్వ నిర్లక్ష్యమా అనేది అర్థంకావటంలేదు. సమర్థుడైనవాడైతే ఈ పాటికి సీమవాసుల అసంతృప్తిని, ఆవేదనను గుర్తించి వారి ఆక్రోశం మరింత పెరగకుండేందుకుగానూ సీమ అభివృద్ధిపై దృష్టి పెట్టిఉండేవాడన్న వాదన వినిపిస్తోంది. వారికి ఇప్పటికే ప్రకటించిన వాటిని, మరికొన్ని కొత్త ప్రాజెక్టులను ఏర్పాటుచేసే పనిని చంద్రబాబు యుద్ధప్రాతిపదికన చేపట్టి సీమవాసులలో అభద్రతా భావాన్ని పోగొట్టి ఒక విశ్వాసాన్ని నెలకొల్పి ఉండాల్సింది. కానీ ముఖ్యమంత్రికి ఇవేమీ పట్టటంలేదు. విజయవాడలో కూర్చుని సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటూ పోతున్నారు. అలాగే పోతూఉంటే – జగన్ ఇటీవల తరచూ అంటున్నట్లు – ప్రజలు ఆయనను తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలపటం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com