ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం శుక్రవారం వరకూ సాగనుంది. ఈ సమావేశంలో రెపోరేటును పెంచాలా తగ్గించాలా అన్నది నిర్ణయిస్తారు . ప్రస్తుతం జరుగుతున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షలో రెపో రేటును 5.25 శాతం వద్దే యథాతథం గా కొనసాగించే అవకాశం ఉందని మెజారిటీ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 సంవత్సరంలో ఇప్పటికే ఆర్బీఐ నాలుగు విడతలుగా మొత్తం 125 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించి, రుణగ్రహీతలకు భారీ ఊరటనిచ్చింది.
ప్రస్తుత ఫిబ్రవరి సమీక్షలో మాత్రం వడ్డీ రేట్ల తగ్గింపునకు విరామం ఇచ్చి, గతంలో చేసిన కోతల ప్రభావం మార్కెట్‌పై ఎలా ఉందో వేచి చూసే ధోరణిని ఆర్బీఐ అవలంబించే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. కేంద్ర బడ్జెట్ , అమెరికా-భారత్ మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందాలతో దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది. ద్రవ్యోల్బణం ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ధరల పెరుగుదల సూచనలు , గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ అప్రమత్తంగా వ్యవహరించనుంది.
అభివృద్ధి రేటు ఆశాజనకంగా ఉండటం కూడా వడ్డీ రేట్లను ఇప్పుడే మరింత తగ్గించాల్సిన అవసరం లేదనే వాదనకు బలాన్నిస్తోంది. ఒకవేళ ఆర్బీఐ రెపో రేటును మార్చకుండా 5.25 శాతం వద్దే ఉంచితే, హోమ్ లోన్ మరియు ఇతర రుణాల ఈఎంఐలలో తక్షణ మార్పులు ఉండవు. ఇది ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి స్థిరత్వాన్ని ఇస్తుంది. అయితే, గతేడాది జరిగిన 1.25 శాతం కోతల ప్రయోజనం ఇంకా పూర్తిస్థాయిలో కస్టమర్లకు అందాల్సి ఉంది కాబట్టి, బ్యాంకులు తమ లెండింగ్ రేట్లను సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 6వ తేదీన శుక్రవారం ఆర్బీఐ అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించనుంది


