ఎక్కడైనా అభిమానానికి సానుభూతిని మించిన ఆయుధం ఉండదేమో. వరుసగా ఓడిపోతూంటే పాపం ఈ ఒక్కసారిగా గెలిస్తే బాగుండు అని ఇష్టం లేని వాళ్లు కూడా అనుకుంటారు. సినిమాల్లోనూ అంతే. వరుసగా ఫ్లాపులు వస్తూంటే ఏ హీరో అయినా.. సానుభూతి గేమ్ ఆడతారు. ఇప్పుడు క్రికెట్ లో అలాంటి సానుభూతి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు లభిస్తోంది. ఈ సారి ట్రోఫీ ఆ టీమ్ గెలవాలని కోరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
రాయల్ చాలెంజర్స్ టీమ్‌లో దిగ్గజ ఆటగాళ్లు చాలా కాలం ఉన్నా.. ఆ టీమ్ ట్రోఫీ వరకూ వెళ్లలేదు. పద్దెనిమిదేళ్లుగా ఆర్సీబీ ఆడుతోంది. ఇప్పటి వరకూ ట్రోఫీ లేదు. చెన్నై, ముంబై లాంటి టీములు చాలా ట్రోఫీలు తీసుకున్నాయి. ఆర్సీబీ మాత్రం తొలి ట్రోఫీ కోసం మొహం వాచిపోయి ఉంది. పై ఆ జట్టులో సూపర్ స్టార్ కోహ్లీ ఉన్నాడు. అతని కోసమైనా ఈ సారి ట్రోఫీ ఆర్సీబీకి దక్కాలని కోరుకునేవారు ఎక్కువగా ఉన్నారు. మొదట్లో తడబడినా తర్వాత దూకుడుగా ఆడుతున్నారు. పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్ కు వచ్చారు.
ప్లే ఆఫ్స్ లో చోటు ఖాయమయిపోయినట్లే. అందుకే ఇప్పుడు అందరూ ఆర్సీబీకి మద్దతు ప్రకటిస్తున్నారు. ఆ జట్టు ఈ సారి తమ కరువు తీర్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మాత్రమే ఆర్సీబీ రేంజ్ లో ఆడుతున్నారు. ఆయా జట్ల ఫ్యాన్స్ కూడా ఈ సారి ఆర్సీబీనే గెలవాలని కోరుకుంటున్నారు.