భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం ఒక వింత పరిస్థితి నెలకొంది. ఒకవైపు లగ్జరీ ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతుండగా, మరోవైపు సామాన్యులు , మధ్యతరగతి ప్రజలు కొనే అఫోర్డబుల్ హౌసింగ్ మార్కెట్ కుప్పకూలుతోంది. పెరిగిన ధరల వల్ల సామాన్యులు ఇళ్ల కొనుగోలుకు దూరమవుతున్నారు.
గత రెండేళ్లలో భూమి ధరలు, నిర్మాణ సామాగ్రి ఖర్చులు విపరీతంగా పెరగడంతో బిల్డర్లు తమ లాభాల కోసం కేవలం లగ్జరీ ప్రాజెక్టులపైనే దృష్టి సారిస్తున్నారు. దీనివల్ల మార్కెట్లో రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల బడ్జెట్లో లభించే ఇళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. సామాన్యుడి సగటు ఆదాయం పెరగనప్పటికీ, ఇళ్ల ధరలు మాత్రం 30 నుండి 50 శాతం వరకు పెరగడం వల్ల ఇల్లు కొనాలనే కల కలగానే మిగిలిపోతోంది. బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించినప్పటికీ, భారీ ఈఎంఐ భారాన్ని మోయలేక మధ్యతరగతి జనం అద్దె ఇళ్లకే పరిమితమవుతున్నారు.
ఈ పరిస్థితి వల్ల దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య రికార్డు స్థాయిలో 5.77 లక్షల యూనిట్లకు చేరినట్లు అనరాక్ వంటి సంస్థల గణాంకాలు చెబుతున్నాయి. డిమాండ్ లేని చోట ధరలు తగ్గించాల్సింది పోయి, ఇన్వెంటరీని అలాగే ఉంచి కృత్రిమంగా ధరలను పెంచుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బిల్డర్లు తమ వ్యూహాన్ని మార్చుకోకపోతే, అమ్ముడుపోని ఈ వేలాది ఫ్లాట్లు రియల్ ఎస్టేట్ రంగాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం బడ్జెట్ 2026లో మౌలిక సదుపాయాలకు కేటాయింపులు చేసినప్పటికీ, సామాన్యుడికి నేరుగా లబ్ధి చేకూర్చే పన్ను రాయితీలు లేదా వడ్డీ సబ్సిడీలు పెంచకపోవడం నిరాశ కలిగించింది. ఒకవైపు ఇళ్లు లేక సామాన్యుడు ఇబ్బంది పడుతుంటే, మరోవైపు వేలాది ఫ్లాట్లు అమ్ముడుపోకుండా ఖాళీగా ఉండటం భారత హౌసింగ్ మార్కెట్లో రాబోయే సంక్షోభానికి సంకేతమన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
