హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ, సామాన్యులకు , మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే కొన్ని ప్రాంతాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా కొంపల్లి, షామీర్పేట, అల్వాల్ వంటి ఉత్తర ప్రాంతాలు, అలాగే ఉప్పల్, ఎల్బీ నగర్, నాగోల్ వంటి తూర్పు ప్రాంతాలలో చదరపు అడుగు ధర రూ. 3,500 నుండి రూ. 5,500 మధ్యలో అందుబాటులో ఉన్నాయి.
పడమర వైపు ఐటీ కారిడార్‌కు దగ్గరగా ఉండి తక్కువ ధరకు ఇల్లు కావాలనుకునే వారికి బాచుపల్లి , నిజాంపేటప్రాంతాలు సరైన ఎంపికగా నిలుస్తున్నాయి. ఇక్కడ 2BHK ఫ్లాట్లు సుమారు రూ. 45 లక్షల నుండి రూ. 60 లక్షల బడ్జెట్లో లభిస్తున్నాయి. అలాగే దక్షిణ హైదరాబాద్‌లోని శంషాబాద్ , ఆదిబట్ల ప్రాంతాలు ఏరోస్పేస్,ఫార్మా సిటీ అభివృద్ధి కారణంగా భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెట్టే పెట్టుబడి మార్గాలుగా మారుతున్నాయి. ఇక్కడ అపార్ట్మెంట్లతో పాటు ప్లాట్ల ధరలు కూడా నగరం లోపలి ప్రాంతాలతో పోలిస్తే 40-50% తక్కువగా ఉన్నాయి.
మధ్య తరగతి వారి కోసం పటాన్చెరు, ముత్తంగి వంటి పారిశ్రామిక శివారు ప్రాంతాలు ఇంకా తక్కువ బడ్జెట్ రూ. 30 నుండి 40 లక్షలు గృహాలను అందిస్తున్నాయి. మెట్రో రైలు విస్తరణ , ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ పెరగడం వల్ల ఈ ప్రాంతాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. తక్కువ ధరలో స్థిరాస్తి కొనాలనుకునే వారు శివారు ప్రాంతాలైన మేడ్చల్, ఘటకేసర్ , హయత్‌నగర్ వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ బడ్జెట్ ఉన్న వారు ఈ ప్రాంతాల్లో ప్రయత్నించవచ్చు.
