సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా.. అనే సంగతి ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఈ సినిమాని పట్టాలెక్కించాలని నిర్మాత రామ్ తాళ్లూరి శతవిధాలా ప్రయత్నించి విఫలం అయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా ముందుకు వెళ్లబోతోందన్న వార్తలు అభిమానుల్ని ఖుషీ చేస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక చాలా కథ నడిచింది.. ఇప్పటికీ నడుస్తూనే ఉంది.
నిర్మాత రామ్ తాళ్లూరితో పవన్ కల్యాణ్ కు మంచి అనుబంధం వుంది. జనసేన సపోర్టర్ కూడా. 2019 ఎన్నికల్లో జనసేన ఓడిపోయిన తరవాత, పార్టీని మళ్లీ బలోపితం చేయాల్సిన అవసరం ఏర్పడింది. పవన్ ఆర్థికంగా నిలబడాల్సిన తరుణం. ఇలాంటి పరిస్థితుల్లో రామ్ తాళ్లూరి కలిశారు. పవన్ వీరాభిమాని అయిన రామ్… ఎలాగైనా పవన్ తో సినిమా చేయాలని నిశ్చయించుకొన్నారు. అందుకుగానూ ఓ భారీ మొత్తం అడ్వాన్స్ గా ఇచ్చారు. అప్పటి వరకూ పవన్ అందుకొన్న అత్యధిక పారితోషికం అదే. ఇప్పటి వరకూ వడ్డీలతో కలుపుకొన్నా.. ఆ పారితోషికం దాదాపు రూ.100 కోట్ల వరకూ అవుతుంది. అదే సమయంలో పవన్ పేరిట.. రామ్ తాళ్లూరి ఓ స్థలం కొన్నారని, రిజిస్ట్రేషన్ కూడా చేయించారని, ఆ స్థలం రేటు ఇప్పుడు పది రెట్లు పెరిగిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ సమయంలోనే సురేందర్ రెడ్డిని తీసుకెళ్లారు. వక్కంతం వంశీ చెప్పిన కథ పవన్‌కు బాగా నచ్చింది. పైగా రామ్ తాళ్లూరిపై పవన్‌కు ఓ నమ్మకం ఏర్పడింది. తనకు ఎలాగైనా ఓ సినిమా చేసి పెట్టాలని డిసైడ్ అయ్యారు. అయితే.. ఆ తరవాత ఎన్నికల్లో బిజీ అవ్వడం.. ‘హరిహర వీరమల్లు’ సినిమాని పూర్తి చేయాల్సిరావడం, మధ్యలో ‘బ్రో’, ‘భీమ్లా నాయక్’లాంటి కథలు ఒప్పుకోవడం.. ఇలా రకరకాల కారణాల వల్ల సినిమా ఆలస్యమైపోయింది. కాకపోతే.. రామ్ తాళ్లూరికి ఇచ్చిన మాట పవన్‌కు గుర్తే. అందుకే మళ్లీ రామ్ తాళ్లూరిని పిలిపించడం.. సినిమా చేద్దాం అని చెప్పడం జరిగాయి.
అయితే ఈలోగా ఓ ట్విస్ట్. `ఏజెంట్` తరవాత దర్శకుడు సురేందర్ రెడ్డికి చాలా గ్యాప్ వచ్చింది. ఈ విరామంలో చాలామంది హీరోలకు కథలు చెప్పారు. వెంకటేష్ తో ఓ సినిమా దాదాపుగా ఫిక్సయ్యింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఆ సమయంలోనే రవితేజకు ఓ కథ చెప్పడం, అది ఓకే అయిపోవడం.. చక చక జరిగాయి. సూరి ఫామ్ లో లేకపోయినా తనతో ఉన్న అనుబంధం దృష్ట్యా రవితేజ సినిమాను ఓకే చేశారు. రవితేజతో సినిమా పట్టాలెక్కబోతున్న తరుణంలో మళ్లీ పవన్ నుంచి పిలుపొచ్చింది. ఇప్పుడు సూరి డైలామాలో పడ్డాడు. సినిమాలు లేని పరిస్థితుల్లో తనకు ఛాన్స్ ఇచ్చిన రవితేజతో ప్రొసీడ్ అవ్వాలా, లేదంటే.. పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలా? అనేది తేల్చుకోలేని పరిస్థితి వచ్చింది. మరోవైపు పవన్ కూడా.. ‘సూరి.. వక్కంతం కాంబోలోనే చేస్తా’ అని గట్టిగా చెబుతున్నార్ట. పవన్ కండీషన్లు పెడితే ఇక ‘నో’ చెప్పడానికి ఏముంది? పైగా రామ్ తాళ్లూరి దగ్గర సురేందర్ రెడ్డి ఇది వరకే అడ్వాన్స్ తీసుకొన్నారు. కాబట్టి.. రవితేజ సినిమాని పక్కన పెట్టి ఇప్పుడు పవన్ సినిమాపై దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది.
కాకపోతే.. ఇక్కడ కూడా ఓచిక్కు వుంది. పవన్ తో సినిమా అంటే చాలా విషయాల్లో రాజీ పడాలి. ఆయన సెట్ కి ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోనూ బిజీ. ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కూడా. కాబట్టి.. ఆయన షెడ్యూల్స్ ఆయనకు ఉంటాయి. రోజుకి నాలుగైదు గంటల్లోనే ఆయన పార్ట్ షూట్ పూర్తవుతుంది. సూరి కథ స్పాన్ పరంగా చాలా పెద్దది. ఏకధాటిగా షూటింగ్ చేస్తే కనీసం 200 రోజులైనా పడుతుంది. పవన్ ఇలా వాయిదాల పద్ధతిపై డేట్లు ఇస్తే అనుకొన్న సమయంలో సినిమా పూర్తి చేయడం చాలా కష్టం. అన్నింటికంటే ముఖ్యంగా సురేందర్ రెడ్డి కూడా చాలా నిదానంగా సినిమా చేసే దర్శకుడే. ఆయన సినిమాని చాలా స్టైలీష్ గా తీయాలనుకొంటారు. టైమ్ పట్టేస్తుంది. కాబట్టి ఒకసారి ఈ సినిమా పట్టాలెక్కితే ఎప్పుడు పూర్తవుతుందో కూడా చెప్పలేం. ఇన్ని షరతుల మధ్య ఈ సినిమా మొదలు కావాల్సివుంది. ‘ఓజీ’ తరవాత పవన్ చేయదగ్గ సినిమా ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఎందుకంటే స్క్రిప్టు ఇది వరకే లాక్. ఇప్పటికే ఆ నిర్మాత పారితోషికం అంతా ఇచ్చేశారు. కాబట్టి.. ఎలాగైనా సరే, ఈ ప్రాజెక్టే ముందుకు వెళ్లాలి. ఓవారం పది రోజుల్లో పవన్ – సురేందర్ రెడ్డి మధ్య ఓ మీటింగ్ ఉండొచ్చు. ఆ తరవాత వీరిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.