ప్రొ.నాగేశ్వర్: మోదీకి అసలైన ఫిట్‌నెస్‌ చాలెంజ్‌..!

భారత ప్రధానమంత్రి నాలుగేళ్లు పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ఆయన ఫిట్‌నెస్ చాలెంజ్‌లు విసురుతున్నారు, ఆయన కూడా చురుగ్గా ఫిట్‌నెస్ చాలెంజ్‌లోపాల్గొంటున్నారు. కానీ ప్రధానమంత్రి ఆయన అసలు ఫిట్‌నెస్‌ చాలెంజ్..గవర్నెన్స్‌లో చూపించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఫిట్‌నెస్‌ నిరూపించుకోగలరా..?

విదేశాల నుంచి బ్లాక్‌మనీ ఎందుకు తేలేదు..?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కానీ… బీజేపీ పార్టీ నేతలు కానీ ఎన్నికల సమయంలో విదేశాలకు తరలి వెళ్లిపోయిన బ్లాక్‌మనీని తీసుకొస్తామని చాలా ప్రకటనలు చేశారు.. ఈ మొత్తం రూ. 71లక్షల కోట్లు ఉంటుందని కూడా.. మీ పార్టీ నేతలు లెక్కలు వేశారు. భారతదేశంలో ఒక్కొక్కరికి రూ.15లక్షలు వస్తాయని ప్రచారం చేశారు. అందరి ఎకౌంట్లలోనూ వేస్తామన్నారు. కానీ ఇంత వరకూ.. ఈ విషయంలో ఫిట్‌నెస్‌ ఏమైంది…?

పెట్రోధరలను ఎందుకు తగ్గించలేకపోయారు..?

ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టేనాటికి క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 140 డాలర్లుగా ఉంది. ఇప్పుడు అది ఎనభై డాలర్లకు అటూ ఇటుగా ఉంది. మీద పదవి కాలంలో.. ఈ రేటు చాలా కాలం పాటు 25 నుంచి 40 డాలర్ల మధ్య చాలా కాలం ఉంది. భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తుల్లో 70శాతం వరకు దిగుమతుల మీదే ఆధారపడుతుంది కాబట్టి.. అంతర్జాతీయ రేట్ల ప్రభావం ఉంటుంది. కానీ.. అంతర్జాతీయంగా తగ్గినప్పుడు..ఎందుకు తగ్గించడం లేదు..? అన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినప్పుడు..పెట్రోల్, డీజిల్ లను ఎందుకు తీసుకు రారు.

దేశీయ నల్లధాన్ని నియంత్రించే చాలెంజ్ ఏమైంది..?

విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తేవడంతో పాటు..దేశంలో ఉన్న నల్లధనాన్ని కూడా నియంత్రించి ఫిట్‌నెస్ నిరూపించుకుంటామని గతంలో ప్రకటించారు. ఇందు కోసం… నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. మూడు లక్షల కోట్ల రూపాయల బ్లాక్‌మనీ దేశీయంగా ఉందని మీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ రిజర్వ్ బ్యాంక్ చెప్పిన వివరాలు ప్రకారం… చాలా కొద్ది మొత్తం మినహా మొత్తం బ్యాంకులకు తిరిగొచ్చాయి. అంటే.. నోట్ల రద్దుతో బ్లాక్‌మనీ అంతా వైట్ అయిపోయిందా..? మనీ లాండరింగ్ జరిగిందా..?

స్ట్రాంగ్ ఇండియన్ ఎకానమీ చాలెంజ్ సంగతి తేల్చారా..?

ప్రధానమంత్రి అధికారంలోకి వచ్చేసరికి.. దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి గందరగోళంగా ఉంది. దాన్ని మెరుగు పరిచేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటామన్నారు. దిగి వచ్చిన క్రూడాయిల్ ధరల కారణంగా.. మోదీ ముందు ఎన్నో అవకాశాలున్నా… దేశ ఆర్థిక వ్యవస్థ ఏ మాత్రం మెరుగుపడిన దాఖలాలు లేవు. ఈ ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడంలో ఎందుకు విఫలమయ్యారు..?

ఉద్యోగాలు సృష్టించే చాలెంజ్ తీర్చలేకపోయారా..?

ఏడాదికి కోటి ఉద్యోగాలు క్రియేట్ చేస్తామన్నారు. ఇంత వరకూ…ఈ విషయంలో మీ ఫిట్‌నెస్‌ నిరూపించుకోలేకోయారు. ముద్ర ద్వారా రుణాలిస్తున్నామంటున్నారు. ముద్ర ద్వారా ఇస్తున్న సగటు రుణం రూ. 47 వేల రూపాయలు మాత్రమే. మీకు చెప్పినట్లు పకోడి బండి పెట్టుకోవడానికి కూడా ఈ రుణం సరిపోదు.

పాకిస్థాన్ భారత్ వైపు కన్నెత్తి కూడా చూడదన్నారే..!

మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్థాన్ ఇక.. భారత్ వైపు చూడకుండా చేస్తామన్నారు. కానీ ఇప్పుడేం జరుగుతోంది. కాశ్మీర్‌లో నిరంతర హింస. 2014 ముందు కన్నా.. ఎక్కువ హింస ఇప్పుడు కాశ్మీర్‌లో జరుగుతోంది. పాకిస్థాన్ కాల్పులు ఆపడం లేదు. ఈ చాలెంజ్‌ ఎందుకు తీర్చలేకపోయారు.

విదేశాంగ విధానంలో అత్యంత ఫెయిల్యూర్ చాలెంజ్..!

ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత… దేశదేశాలు తిరిగారు. ప్రధానిగా బాధ్యతల స్వీకారానికి చుట్టుపక్కల దేశాలన్నింటినీ ఆహ్వానించారు. కానీ అమెరికాతో స్నేహం కోసం అందర్నీ దూరం చేసుకున్నారు. అమెరికాకు దగ్గరవడం వల్ల… చైనా, రష్యా దూరమయ్యాయి. పొరుగు దేశాలన్నీ దేశానికి వ్యతిరేకమయ్యాయి. నేపాల్‌లో ప్రజాప్రభుత్వానికి కాకుండా… ఇతరులకు మద్దతివ్వడం వల్ల… నేపాల్ చైనాకు దగ్గరవుతోంది. భూటాన్, మాల్దీవులు, శ్రీలంక…. ఇవన్నీ ఇప్పుడు భారత్‌తో అంటీముట్టనట్లు ఉన్నాయి. అన్ని దేశాలు తిరిగినా ఇంత వరుక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతసభ్యత్వం తేలేకపోయారు.

మీ నానాదాలు చాలెంజ్‌లేమయ్యాయి…?

స్వచ్చ భారత్ పేరుతో టాయిలెట్లు కట్టి ఆత్మగౌరవం ఇచ్చామంటున్నారు. కానీ కట్టిన పది టాలెయిట్లలో ఆరింటిలో నీళ్లు లేదు. వీటి వల్ల ఉపయోగం ఏముంటుంది. ఇది ఓ నినాదంగా మాత్రమే మిగిలింది. జాతీయ ఉపాధి గ్రామీణ నీటి సరఫరా పథకానికి 30 శాతం నిధులు తగ్గించారు. ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. కానీ అన్ని రాష్ట్రాల్లో రైతులు.. ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల సమయంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం.. పెట్టుబడి ఖర్చుతో పాటు 30 శాతం లాభం వచ్చేలా చూస్తామన్నారు. విద్య కు కూడా నిధులు తగ్గించారు. ఏ ప్రభుత్వం కూడా..ఇంత వరకూ విద్యారంగానికి నిధులు తగ్గించిన ప్రభుత్వం మీదే.

స్కామ్‌లపై చాలెంజ్‌లు పట్టించుకోరా..?

నరేంద్రమోదీ హయాంలో లక్షల కోట్ల బ్యాంకుల రుణాలను తీసుకుని.. బడా మనుషులు పరారయ్యారు. ఇప్పుడు రూ. 10 లక్షల కోట్లు.. 12 మంది బడా కార్పొరేట్లు ఎన్‌పీఏలుగా మార్చేశాయి. నిరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వాళ్లను ఎందుకు తీసుకురాలేకపోయారు. కాంగ్రెస్ కుంభకోణాల వల్లే మీరు అధికారంలోకి వచ్చారు. కానీ ఆ కుంభకోణాల్లో ఒక్కరికీ శిక్ష వేయలేదు. పైగా రాఫెల్ పేరుతో.. అనిల్ అంబానీ కంపెనీకి రూ .20 వేల కోట్ల లాభం చేసేలా స్కామ్ చేశారు. లోక్‌పాల్‌ను ఎందుకు పట్టించుకోలేదు. సుప్రీంకోర్టులో కూడా రాజకీయ జోక్యం వల్ల… క్రైసిస్ ఏర్పడిన పరిస్థితి దేశంలో ఏర్పడింది.

ఎన్నికలప్పుడు చాలెంజ్‌లు ఇప్పుడు జుమ్లాలా..?

ఈ చాలెంజ్‌ల గురంచి ఎవరైనా మీ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాను అడిగితే… ఎన్నికల సమయంలో చాలా చెబుతాం. అన్నీ చేస్తామా..? ఎలక్షన్ జుమ్లా అంటారు. అంటే మీ ఫిట్‌నెస్ అంతా జుమ్లానా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.