ఓటీటీ మార్కెట్ ఈమధ్య కాలంలో చాలా డల్ గా ఉంది. చిన్న సినిమాలన్నీ ఓటీటీలపై ఆశలు వదిలేసుకొన్నట్టే. మీడియం రేంజ్ సినిమాలు అటూ ఇటూ కాకుండా ఉన్నాయి. సినిమా బాగుంటే కొంటున్నారు. పెద్ద బ్యానర్ అయితే కొంటున్నారు. లేదంటే పట్టించుకోవడం లేదు. పెద్ద సినిమాలు ఈ విషయంలో హ్యాపీ. స్టార్లు ఉంటారు కాబట్టి, ఓటీటీలు ఉత్సాహం చూపిస్తుంటాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని సినిమాలు సైతం ఓటీటీలకు అమ్ముడుపోవడం లేదు. ‘రాజాసాబ్’ ఇందుకు తాజా ఉదాహరణ.
ప్రభాస్ సినిమా ఇది. ఆ పేరుంటే చాలు… ఓటీలు ఎగబడతాయి. కానీ రాజాసాబ్ ఓటీటీ హక్కులు ఇప్పటి వరకూ అమ్ముడు పోలేదు. ఇప్పటి వరకూ వచ్చిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. మారుతిపై కూడా నమ్మకం ఉంది. కానీ ఓటీటీ డీల్ క్లోజ్ కాకపోవడం ఆశ్చర్యకరమే.
దీని వెనుక ఓ సీక్రెట్ వుంది. నిజానికి ‘రాజాసాబ్’ ఓటీటీ డీల్ దాదాపుగా క్లోజ్. నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ అటూ ఇటుగా రూ.200 కోట్లు పలుకుతున్నాయి. హాట్ స్టార్ దగ్గర ఈ డీల్ వుంది. కానీ ఈ సినిమాకు సంబంధించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ముంబైకు చెందిన ఓ కంపెనీ దగ్గర ఫైనాన్స్ తీసుకొంది. ఆ కంపెనీతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇప్పుడు మంచి సంబంధాలు లేవు. ఒకరిపై మరొకరరు కోర్టు లో కేసులు వేసుకొన్నారు. ఈ సినిమా కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దాదాపు రూ.250 కోట్లు ఆ సంస్థ దగ్గర ఫైనాన్స్ తీసుకొందని టాక్. వడ్డీలతో కలుపుకొని అవి రూ.300 కోట్ల వరకూ అయ్యాయట. అవన్నీ క్లియర్ చేస్తే కానీ, ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వదు. సదరు ఫైనాన్స్ సంస్థ ఎన్.ఓ.సీ ఇవ్వాలి. అది ఇస్తే తప్ప.. ఓటీటీ ఎవరూ కొనరు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సంప్రదింపులే జరుగుతున్నాయి. జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నవంబరు 5న తొలి పాట బయటకు వస్తుంది. అక్కడి నుంచి ప్రమోషన్స్ మొదలవుతాయి. నవంబరు చివరి వారం నాటికి ఓటీటీ డీల్ క్లోజ్ చేయాలన్నది ప్లాన్. ఆ లోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫైనాన్స్ మొత్తం క్లియర్ చేసుకొని, ఎన్.ఓ.సీ తెచ్చుకోవాల్సివుంది.