ఇళ్ల కొనుగోలుదారుల వద్ద డబ్బులు వసూలు చేసి చెప్పిన సమయానికి ఇవ్వకుండా వేధిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ …. కొరడా ఝుళిపిస్తోంది. వినియోగదారులు చేసే ఫిర్యాదులపై విచారణ జరిపి నిర్ణయాలు ప్రకటిస్తోంది. తాజాగా భువంతేజ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై 6.4 లక్షలు జరిమానా విధించింది.
ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ చేయకపోవడం, కస్టమర్ల నిధుల దుర్వినియోగం, పొజెషన్ ఇవ్వకపోవడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, అనుమతులు లేకుండా నిర్మాణాలు, ప్రాజెక్టులు వదిలేసి పారిపోవడం వంటి ఆరోపణలు ఈ కంపెనీపై వచ్చాయి. ఈ ఉల్లంఘనలను ‘తీవ్రమైనవి’గా అభివర్ణించిన టీజీఆర్‌ఈఆర్‌ఏ, మూడు వేర్వేరు ఫిర్యాదుల్లో కస్టమర్లకు పూర్తి మొత్తాలు తిరిగి ఇవ్వాలని, 10.7% నుంచి 10.75% వడ్డీతో సహా 30 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. ఆదేశాలు పాటించకపోతే రెరా చట్టం సెక్షన్ 63 కింద మరిన్ని జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ఒక కేసులో మధ్యవర్తికి అదనంగా రూ. 1 లక్ష జరిమానా విధించారు.
ఈ కంపెనీ దేవాస్ ఇన్ఫ్రా వెంచర్స్ పేరుతో ప్రారంభమై తర్వతా భువంతేజ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గా మార్చారు. . భువంతేజ ఇన్ఫ్రా బంజారాహిల్స్‌లోని కార్యాలయం మూసేసి, సిబ్బంది అందుబాటులో లేకుండా పోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్ల హక్కులను రక్షించడం, బిల్డర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నొక్కి చెప్పుతున్నాయి. మరికొన్ని ఇతర కంపెనీలపైనా రెరా కఠిన చర్యలు తీసుకుని వినియోగదారుల హక్కులను రక్షించే ప్రయత్నం చేస్తోంది.