ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్తపలుకు తెలంగాణ రాజకీయవర్గాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఖమ్మంలో జరిగిన బహిరంగసభలో ఆయనకీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణిలో కుంభకోణం జరిగింది, బొగ్గు మాయమైందని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదు. మంత్రులు, ఎమెల్యేలు, ఎంపీల మీద వార్తలు రాసేముందు తన వివరణ తీసుకోవాలన్నారు. తన ప్రభుత్వంలో అంతా పారదర్శకంగా ఉంటుందన్నారు.
మీకు మీకు మధ్య ఏమైనా ఉంటే .. అది వేరేగా చూసుకోవాలని.. తమ మంత్రుల్ని ఇందులోకి లాగవద్దన్నారు. అంటే అది ఎన్టీవీ చైర్మన్, ఆంధ్రజ్యోతి ఎండీ మధ్య నడుస్తున్న ఓ వివాదం అన్నట్లుగా రేవంత్ తేల్చేశారు. తమ మంత్రులకు సంబంధం లేదని ఆయన క్లీన్ చిట్ పరోక్షంగా ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీలోని ప్రజా ప్రజాప్రతినిధులందరికి .. కుటుంబ పెద్దగా తానున్నానని.. వారిపై ఆరోపణలు వస్తే.. ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందన్నారు. తమ వారిపై ఎలాంటి ఆరోపణలు వివరణ ఇవ్వడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు.
కొత్తపలుకు ఆర్టికల్‌లో సింగరేణి బొగ్గు తవ్వకం టెండర్ల విషయంలోనే ఇదంతా జరుగుతోందని ఆర్కే తేల్చారు. ఇందులో భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రస్తావించారు. అందులో భాగంగానే భట్టి విక్రమార్క సన్నిహితుడు అయిన ఎన్టీవీ నరేంద్ర చౌదరి ద్వారా కోమటిరెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేయడానికి మహిళా ఐఏఎస్‌లపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని తేల్చారు. ఈ అంశంపై భట్టి విక్రమార్క కూడా స్పందించారు. వైఎస్ పై కోపంతో తనపై వార్తలు రాశారని.. తాను తేల్చుకుంటానన్నారు. కానీ సీఎం మాత్రం మంత్రులకు క్లీన్ చిట్ ఇచ్చేశారు.

