భార‌తీయుడి సెట్లో ప్ర‌మాదం: నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మా?

భార‌తీయుడు 2 సెట్లో భారీ ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డం, ముగ్గురు ప్రాణాలు కోల్పోవ‌డంతో చిత్ర‌సీమ షాక్‌కి గురైంది. క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్‌, కాజ‌ల్ తృటిలో ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకోవ‌డం వ‌ల్ల – అంతా ఊపిరి పీల్చుకున్నారు. వీళ్ల‌లో ఎవ‌రికి ఏం జ‌రిగినా – చ‌ల‌న చిత్ర‌సీమ‌లో అది ఎవ్వ‌రూ మ‌ర్చిపోలేని పెను విషాదంగా మారేది. ప్రాణాలు కోల్పోయిన వాళ్ల కుటుంబాల్ని ఆదుకోవ‌డానికి లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ముందుకొచ్చింది.క‌మ‌ల్ ఇప్ప‌టికే కోటి రూపాయ‌ల సాయం ప్ర‌క‌టించారు. అయితే.. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంద‌ని తెలుస్తోంది. అస‌లు సెట్లో ఏం జ‌రిగింద‌న్న విష‌యంపై పోలీసులు విచార‌ణ చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. చిత్ర‌బృందం నిర్ల‌క్ష్యం మూలంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌న్న ప్రాధ‌మిక నిర్దార‌క‌ణకు వ‌చ్చారు.

నిజానికి సినిమా సెట్స్‌లో క్రేన్‌ల‌ను వాడ‌డం స‌హ‌జ‌మే. అయితే… భారతీయుడు 2 సెట్లో వాడిన క్రేజ్ అతి భారీద‌ని తెలుస్తోంది. దాని స్టామినా 60 అడుగుల ఎత్తు వ‌ర‌కే అని తెలుస్తోంది. అయితే వంద అడుగుల ఎత్తు వ‌ర‌కూ తీసుకెళ్లి క్రేన్ ని ఉప‌యోగించ‌డం వ‌ల్లే బ్యాలెన్స్ కుద‌ర‌లేద‌ని, అస‌లు వంద అడుగుల ఎత్తున్న క్రేన్ వాడే అనుమతులే లేవ‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ విష‌య‌మై నిర్మాత‌ల్ని, ద‌ర్శ‌కుడిని సైతం పోలీసులు విచారించే అవ‌కాశం ఉంది. సెట్లో క‌నీస భ‌ద్ర‌త కోసం ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లేం తీసుకోలేద‌ని, అందువ‌ల్లే ప్రాణ న‌ష్టం జ‌రిగింద‌ని తెలుస్తోంది. మ‌రి పోలీసులు ఎవ‌రిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com