ఈ సంక్రాంతి సినిమాలతో టాలీవుడ్ కి జోష్ వచ్చింది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా మంచి విజయాన్ని అందుకొంది. దాంతో పాటు ‘నారీ నారీ నడుమ మురారి’, ‘అనగనగా ఒకరాజు’ హిట్ జాబితాలో నిలిచాయి. ‘రాజాసాబ్’ ఫలితమే నిరుత్సాహానికి గురి చేసింది. సంక్రాంతి బరిలో అందరి కంటే ముందు వచ్చిన సినిమా ఇది. ఫ్యాన్స్ కూడా బాగా ఆశలు పెట్టుకొన్నారు. కానీ అవన్నీ అడియాశలే అయ్యాయి. ‘రాజాసాబ్ పాన్ ఇండియా సినిమా హిట్టయితే.. పరిస్థితి మరోలా వుండేది. 2026 సంవత్సరానికి గొప్ప బూస్టప్ దొరికేది. కానీ ఆ అవకాశం జారిపోయింది.
రాజాసాబ్ ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు నిందలన్నీ దర్శకుడు మారుతి మోయాల్సివస్తోంది. సోషల్ మీడియాలో మారుతిని టార్గెట్ చేస్తూ చాలామంది రెబల్ ఫ్యాన్స్ యుద్ధానికి దిగారు. కొన్ని ట్వీట్లయితే మరీ వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ లో యాక్టీవ్ గా ఉన్న ఎస్కేఎన్ పై కూడా ట్వీట్లతో దాడి చేస్తున్నారు ఫ్యాన్స్.
ప్రభాస్ లాంటి ఓ పెద్ద స్టార్ తో అవకాశం వచ్చినప్పుడు మారుతి రెండు చేతులా అందిపుచ్చుకోలేని మాట వాస్తవం. ఇందులో మరో ఆర్గ్యుమెంట్ కి తావులేదు. కానీ మరీ ఇన్ని నిందలూ, ఇన్ని రాళ్లా? అనిపిస్తుంది. ‘ప్రభాస్ దగ్గరుండి.. తన కిచెన్లో చేయించుకొన్న ఇష్టమైన వంటకం ఇది’ అని రాజాసాబ్ గురించి చాలాసార్లు చెప్పాడు. అది నిజం కూడా. ‘నాకు హారర్ కామెడీ కథ కావాలి’ అని ప్రభాస్ దగ్గరుండి ఈ కథ రాయించుకొన్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ల ఛాయిస్ కూడా ప్రభాస్దే అని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి ఓ పాట రీమిక్స్ చేశారు. ఆ ఐడియా కూడా ప్రభాస్ దే. అంతేకాదు.. ఎడిటింగ్ పనులన్నీ ప్రభాస్ ఆధ్వర్యంలోనే జరిగాయి. ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఫైట్ చివరి నిమిషంలో ఎడిట్ చేసింది ప్రభాస్. ఆ తరవాత కలపాల్సివచ్చింది అది వేరే విషయం. సో..ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలన్నీ ప్రభాస్ తీసుకొన్న మాట వాస్తవం. సో.. ఓ విధంగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎక్కువ. ఓ సినిమా హిట్టయితే.. దాని ప్రతిఫలం అందరూ తీసుకొంటారు. ఫ్లాప్ అయితే మాత్రం హీరోనో, దర్శకుడో మోయడం మాత్రం అమానుషం. ఓ సినిమా బాగా ఆడితే అది సమష్టి కృషి అని ఎలా అనుకొంటారో, ఫ్లాప్ కి కూడా అందరూ బాధ్యత వహించాలి. అదే ధర్మం.
