ఇదంతా కాదు.. ఇప్పుడు సీఎం రమేష్తో లొల్లి పెట్టుకోవాల్సిన అవసరం ఏంది ?. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్లో ఎవరికీ సమాధానం దొరకని ప్రశ్న. కాంట్రాక్టులు వస్తాయో అందరికీ తెలుసు. మేఘాకు వచ్చాయి.. పొంగులేటి కంపెనీకి వచ్చాయి.. ఇంకా చాలా కంపెనీలకు చాలా కాంట్రాక్టులు వచ్చాయి. అవన్నీ రూల్స్ ప్రకారం లేకపోతే ఎప్పుడో కోర్టు కేసులయ్యేవి. కానీ ఒక్క సీఎం రమేష్ తోనే లొల్లి పెట్టుకోవడం ఎందుకు?
సీఎం రమేష్ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఆయన ఏపీకి చెందిన ఎంపీ. తెలంగాణ బీజేపీలో ఆయన పాత్ర కూడా ఏమీ లేదు. ఇప్పటికిప్పుడు ఆయనను టార్గెట్ చేయాల్సిన ఏమి వచ్చింది?. ఆయన కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్, సీఎం రమేష్ ఒకటే అని ప్రచారం చేయడం.. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఏదో జరిగిపోయిందని లింక్ పెట్టేసి ప్రచారం చేయడం వల్ల లాభమేంటి?
ఇప్పుడు సీఎం రమేష్ నేరుగా కేటీఆర్ ఇజ్జత్ తీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. మీడియాకు ఇంటర్యూలు ఇస్తూ విలీనం చర్చల కోసం కేటీఆర్ బతిమాలారని కూడా చెబుతున్నారు. దానికి బీఆర్ఎస్ వద్ద సమాధానం లేదు. ఆయన చంద్రబాబు ఇంట్లో ఉంటాడు.. రేవంత్ ఇంట్లో ఉంటాడు.. సీసీ ఫుటేజీలు తీసుకు రండి అని ఎదురు సవాళ్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని తీసుకు రండి చర్చిద్దామని తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు.
అనవసరంగా సీఎం రమేష్ ను వివాదాల్లోకి తెచ్చి..ఇప్పుడు ఆయనకు కౌంటర్ ఇవ్వడానికి పార్టీ అంతా రంగంలోకి దిగి విచిత్రమైన వాదనలు వినిపించాల్సి వస్తోంది. జగదీష్ రెడ్డి దగ్గర నుంచి క్రిషాంక్ వరకూ ఎలాంటి డిఫెండ్ చేసుకోవాలో తెలియక.. విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనను టార్గెట్ చేసి..ఇప్పుడు ఆయనకు కౌంటర్ ఇవ్వడానికి పార్టీ సమయం మొత్తం వెచ్చించడం ఎందుకు ? దాని వల్ల బీఆర్ఎస్కు కలిగే లాభమేంటి?.