శ్రీశైలం పర్యటనలో ప్రధాని మోదీ లోకేష్‌కు ఇచ్చిన ప్రాధాన్యం, చూపించిన అభిమానం మరోసారి అందర్నీ ఆకర్షించింది. ఆహ్వానం పలికేటప్పుడు.. లోకేష్ బాగా బరువు తగ్గారని సరదాగా మాట్లాడారు. తర్వాత వేదికపై జ్ఞాపిక ఇచ్చే సమయంలో మరింత ఆశ్చర్యకంగా.. చంద్రబాబు కన్నా.. లోకేష్ చేతుల మీదుగానే ఆ పుస్తకం తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. లోకేష్ పట్ల మోదీ చూపిస్తున్న అభిమానం.. బీజేపీ నేతలతో సహా అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
గతంలో వారసుడు అని వ్యతిరేకత
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఆ సమయంలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారసభలో ప్రసంగించిన మోదీ .. నారా లోకేష్ ను వారసుడిగా విమర్శించారు. చంద్రబాబు కుమారుడి కోసమే పని చేస్తున్నారని అన్నారు. అప్పట్లో ఆయన నారా లోకేష్ .. సమర్థతపై మోదీకి సందేహాలు ఉన్నాయి. ఆయనను బలవంతంగా రుద్దుతున్నారని అనుకున్నారు. సహజంగా బీజేపీ రాజకీయ వారసత్వానికి వ్యతిరేకం. సమర్థత నిరూపించుకుంటే మాత్రం ప్రోత్సహిస్తారు.
మోదీని మెప్పించిన నారా లోకేష్ సమర్థత
కేవలం పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన చంద్రబాబుపై, నారా లోకేష్ పై మోదీ ప్రత్యేకంగా అభిమానం చూపించాల్సిన అవసరం లేదు. మనసుకు నచ్చితేనే మోదీ అభిమానిస్తారు. నారా లోకేష్ మోదీ అభిమానాన్ని సంపాదించుకున్నారు. మోదీకి తనపై వ్యతిరేకత ఉందని.. రాజకీయ వారసుడిగా అవకాశాలు పొందుతున్నానని ఆయన అనుకుంటున్నారని అంచనా వేసుకునే ఉంటారు. మోదీ అభిప్రాయాన్ని లోకేష్ తన సమర్థతతోనే పటాపంచలు చేశారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ఢిల్లీలో ఆయన చక్కబెట్టిన పనులు , చాకచక్యం,తమ వాదన వినిపించిన వైనం మెచ్చాయి. ఆ తర్వాత బీజేపీతో పొత్తు.. కూటమి విజయాల కోసం ఆయన చేసిన ప్రయత్నాలు, వ్యూహాలు మరింతగా మెప్పించాయి. అభివృద్ధికోసం .. ప్రజల బాగు కోసం ఆయన ఆలోచనలు కూడా మోదీని ఆకట్టుకున్నాయని అనుకోవచ్చు.
దేశ భవిష్యత్ నేతల్లో లోకేష్ కీలకం
ప్రధాని మోదీ ఇప్పుడు మాత్రం ఆయన దేశ రాజకీయాలను మార్చే యువనేతల్లో ఆయన కీలకమని అనుకుంటున్నారు. అందుకే ఆయనను ప్రోత్సహిస్తున్నారు. వ్యక్తిగతంగానూ లోకేష్‌ను మోదీ అభినందిస్తున్నారు. ప్రోత్సహిస్తున్నారు. కుటుంబంతో సహా పిలించుకుని గంటకుపైగా రాజకీయేతర అంశాలు మాట్లాడారు. లోకేష్ లాంటి యువనేతలతో మోదీ ముఖాముఖి సమావేశాలు అరుదు. కానీ లోకేష్ కు మాత్రం అపాయింట్మెంట్లు ఇస్తారు. మొత్తంగా లోకేష్ ఇప్పుడు.. మోదీ మెచ్చిన యువనేతల్లో మొదటి వరసలో ఉంటారని అనుకోవచ్చు.