గత కొన్నేళ్లుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన హైదరాబాద్ శివార్ల రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం ఊహించని మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా నగరం నుండి 50 నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్ , వికారాబాద్ జిల్లాల పరిధిలోని వ్యవసాయ భూముల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. గతంలో ఎకరాకు కోట్లు పలికిన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు కొనుగోలుదారులు కరువవ్వడం, రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గడం జిల్లా స్థాయి విశ్లేషణల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
పెట్టుబడిదారులు ప్రస్తుతం వేచి చూసే ధోరణి ని అవలంబించడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మారుతున్న భూవినియోగ విధానాలు, , మూసీ రివర్ ఫ్రంట్ వంటి భారీ ప్రాజెక్టుల పునర్నిర్మాణ నిర్ణయాల కారణంగా .. ఏ భూమి ఏ జోన్లోకి వస్తుందో అన్న ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొంది. దీనికి తోడు పెరిగిన మార్కెట్ విలువల వల్ల రిజిస్ట్రేషన్ ఖర్చులు భారం కావడంతో, సామాన్య , మధ్యతరగతి పెట్టుబడిదారులు వెనకడుగు వేస్తున్నారు.
గతంలో వెంచర్ల పేరుతో వ్యవసాయ భూములను భారీ ధరలకు విక్రయించిన రియల్టర్లు ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. నగరం చుట్టూ ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్ , ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల అలైన్మెంట్ విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో, భారీ పెట్టుబడులు పెట్టిన వారు ఆందోళన చెందుతున్నారు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు మాత్రమే తక్కువ ధరకైనా భూములు అమ్ముకోవడానికి సిద్ధపడుతుండగా, కొత్తగా కొనేవారు మాత్రం భద్రత లేనిదే ముందుకు రావడం లేదు.
ఈ స్తబ్దత మరికొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం భూసేకరణ , జోనింగ్ నిబంధనలపై పూర్తిస్థాయి స్పష్టత ఇస్తే తప్ప, శివారు ప్రాంతాల్లో మళ్లీ రియల్ జోరు పెరగడం కష్టమని తెలుస్తోంది. ప్రస్తుతానికి మాత్రం హైదరాబాద్ చుట్టూ ఉన్న వ్యవసాయ భూముల మార్కెట్ పూర్తిగా బ్రేక్ పడినట్లుగా కనిపిస్తోంది.