ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేని లే ఔట్లు, భవనాల క్రమబద్దీకరణపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఏపీలోని ప్రధాన పట్టణాలుగా ఉన్న తిరుపతి, కడప, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి , విశాఖ , విజయనగరం తో సహా ఇతర ద్వితీయ శ్రేణి నగరాల్లో పెద్ద ఎత్తున అనుమతుల్లేని లే ఔట్లు ఉన్నాయి. సీఆర్డీఏ పరిధి దాటి న తర్వాత కూడా ఇలాంటి లే ఔట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటికి ఇప్పుడు అనుమతులు ఇవ్వడం సాధ్యం కాని విషయం . లేకపోతే ఆ రియల్ ఎస్టేట్ సంపద అంతా అలా చిక్కుకుపోతుంది.
ఈ విషయాలను ఆలోచించిన ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఉన్న లే ఔట్లను క్రమబద్దీకరించాలని భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ప్రకటించింది కానీ.. అమలు చేయడంలో సమస్యలను ఎదుర్కొంటోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి .. న్యాయపరమైన అన్ని సమస్యలను పరిష్కరించిన తర్వాతే అమలు చేయాలని అనుకుంటోంది.
ఏపీ ప్రభుత్వం అనుమతులు తీసుకోకుండా నిర్మించిన భవనాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. వాటిని కూడా క్రమబద్దీకరించాలని ఆలోచిస్తున్నారు. చాలా మంది ప్లాన్లు తీసుకోకుండా.. అంతస్తుల మీద అంతస్తులు నిర్మించేసుకున్నారు. వాటిని రెగ్యులరైజ్ చేస్తే.. ఆస్తి పన్ను కూడా పెరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని ఆలోచిస్తున్నారు.
అన్ని సక్రమంగా ఉన్నా వివిధ కారణాలతో అనుమతులు తీసుకోని వారికి ఇలాంటి క్రమబద్దీరణ మంచి అవకాశంగా ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం, రియల్ ఎస్టేట్‌కు ఊపు లభిస్తుంది.