రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న పెట్టుబడిదారులకు సరికొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. కేవలం పది నుంచి పాతిక లక్షల రూపాయలతోనే మాల్స్, ఐటీ పార్కులు , పెద్ద పెద్ద ఆఫీస్ స్పేస్‌లలో వాటా పొందేలా SM-REIT అనే కొత్త మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్.. దీనినే క్లుప్తంగా ‘రీట్స్’ అని పిలుస్తారు. ఇది మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఒక వ్యవస్థ. మ్యూచువల్ ఫండ్స్‌లో మనం పెట్టే డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లుగా, రీట్స్ సంస్థలు ప్రజల నుంచి సేకరించిన నిధులను ఆదాయాన్ని ఇచ్చే వాణిజ్య ఆస్తులు మాల్స్, ఆఫీస్ భవనాలు, హోటళ్లు వంటి వాటిల్లో పెట్టుబడి పెడతాయి. ఆ ఆస్తుల ద్వారా వచ్చే అద్దెను, లాభాలను పెట్టుబడిదారులకు డివిడెండ్ల రూపంలో పంచుతాయి. గతంలో ఇది కేవలం వందల కోట్ల రూపాయలు ఉన్న పెద్ద సంస్థలకే పరిమితం కాగా, ఇప్పుడు సెబీ తెచ్చిన కొత్త నిబంధనలతో సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది.
సెబీ ప్రవేశపెట్టిన SM-REIT విధానం ఒక గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు. సాధారణ రీట్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ. 500 కోట్ల విలువైన ఆస్తులు ఉండాలి. కానీ, కొత్తగా వచ్చిన SM-REIT మోడల్లో రూ. 50 కోట్ల నుంచి రూ. 500 కోట్ల మధ్య విలువ ఉండే చిన్న , మధ్యతరగతి ఆస్తులను కూడా ఇందులో చేర్చవచ్చు. దీనివల్ల ఒక సాధారణ వ్యక్తి కూడా సుమారు రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల పెట్టుబడితో ఒక పెద్ద ఆఫీస్ స్పేస్‌లో లేదా షాపింగ్ మాల్లో ఫ్రాక్షనల్ ఓనర్షిప్ పొందవచ్చు.
ఈ విధానం వల్ల పెట్టుబడిదారులకు ప్రధానంగా మూడు రకాల ప్రయోజనాలు ఉంటాయి. మొదటిది, స్థిరమైన అద్దె ఆదాయం. రీట్స్ సంస్థలు తమకు వచ్చే నికర ఆదాయంలో కనీసం 90 నుంచి 95 శాతం వరకు పెట్టుబడిదారులకు డివిడెండ్ రూపంలో పంపిణీ చేయాలి. రెండవది, ఆస్తి విలువ పెరుగుదల. కాలక్రమేణా ఆ కమర్షియల్ ప్రాపర్టీ విలువ పెరిగితే, మీ పెట్టుబడి విలువ కూడా పెరుగుతుంది. మూడవది, లిక్విడిటీ. సాధారణంగా ఒక ఇంటిని లేదా స్థలాన్ని అమ్మాలంటే నెలల సమయం పడుతుంది, కానీ రీట్స్ యూనిట్లను స్టాక్ ఎక్స్ఛేంజ్లో షేర్లలాగే ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు.
ముఖ్యంగా అక్రమ రియల్ ఎస్టేట్ స్కీములకు చెక్ పెట్టేందుకు సెబీ ఈ రంగాన్ని పూర్తి పర్యవేక్షణలోకి తెచ్చింది. ప్రతి SM-REIT తప్పనిసరిగా సెబీ వద్ద రిజిస్టర్ అయి ఉండాలి . దాని నిర్వహణకు ఒక ట్రస్టీ, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ఉండాలి. దీనివల్ల చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టేవారికి భద్రతతో పాటు పారదర్శకత కూడా లభిస్తుంది. 2026 నాటికి భారత మార్కెట్లో ఈ తరహా పెట్టుబడులు సుమారు 60 బిలియన్ డాలర్లకు చేరుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.


